మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే

తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రిగా ఆదివారం కొండా సురేఖ పదవీ బాధ్యతలు స్వీకరించారు

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే

విధాత : తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రిగా ఆదివారం కొండా సురేఖ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 4 వ అంతస్తులో ఉన్న అటవీ, పర్యావరణ మంత్రిత్వ కార్యాలయంలో ప్రత్యేక పూజాలు నిర్వహించిన అనంతరం మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. వన్యప్రాణుల దాడిలో మృతి చెందిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను 5నుంచి 10లక్షలకు పెంచనున్న ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అలాగే ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఎనుగులు తెచ్చుకునేందుకు అనమతిస్తు మరో ఫైల్‌పై సంతకం చేశారు.

బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ససా కుటుంబ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, నియోజకవర్గ నాయకులు, అటవీ, దేవాదాయ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందించారు. 

అనంతరం అటవీ శాఖ సంరక్షణాధికారి ఆర్‌ఎం. డోబ్రియేల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాఖ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. తాను నిత్యం అందుబాటులో ఉంటానని, తన పరిధిలోని శాఖల సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని, సమిష్టిగా టీమ్ వర్క్‌తో పనిచేసి లక్ష్యాలు సాధిద్దామని సూచించారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని తెలిపారు.

కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను ఈ సందర్భంగా మంత్రి అవిష్కరించారు.