కవిత అరెస్టుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీఆరెస్ ఎన్నటికీ బీజేపీకి బీ టీం కాదని కే తారకరామారావు అన్నారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదని తేల్చి చెప్పారు

- బీజేపీతో పొత్తు లేదని చెప్పుకొనేందుకు ప్రయత్నాలు
- యాదాద్రి అక్షింతలు మేమూ పంచితే గెలిచేవాళ్లమేమో!
- భువనగిరి లోక్‌సభ సన్నాహక భేటీలో కేటీఆర్
విధాత : బీఆరెస్ ఎన్నటికీ బీజేపీకి బీ టీం కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదని తేల్చి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్, బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉన్నదనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రచారాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కవిత అరెస్టు కాకపోవడానికి బీజేపీతో ఉన్న లోపాయికారీ ఒప్పందాలే కారణమనీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భువనగిరి లోక్‌సభ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కవిత అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలను, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించింది బీఆరెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా? అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీం కోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదని వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌ను ఓడించాయని అన్నారు. ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే వారు శంకరాచార్యులు, పీర్ల పండగకు ముడి పెడుతున్నట్టు లెక్క అని తేల్చారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. అమిత్‌షాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉపఎన్నికల పద్ధతి మారిందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా తమకు నిరాశ తప్పలేదని చెప్పారు.
బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి సమావేశంలో ఇలా చేస్తే గెలిచేవాళ్లమేమో.. అలా ఆలోచించి ఉంటే గెలిచేవాళ్లమేమో అంటున్న కేటీఆర్ తాజాగా యాదాద్రి విషయంలో అదే పాట పాడారు. ‘మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్ళమేమో’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు పొలిటికల్ హిందువులు అయితే.. కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువు అని చెప్పారు. బీఆరెస్సే నిజమైన లౌకిక పార్టీ అని అభివర్ణించారు.