KTR | రైతు రుణమాఫీ సమస్యలపై ఆందోళనకు బీఆరెస్ పిలుపు.. 22న రాష్ట్ర వ్యాప్త నిరసనలు
రైతు రుణామాఫీ లెక్కలపై మొదటి నుంచి ఆక్షేపణ తెలుపుతున్న బీఆరెస్ పార్టీ రుణమాఫీ అసంపూర్ణమని, లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరుగలేదంటూ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
విధాత, హైదరాబాద్ : రైతు రుణామాఫీ లెక్కలపై మొదటి నుంచి ఆక్షేపణ తెలుపుతున్న బీఆరెస్ పార్టీ రుణమాఫీ అసంపూర్ణమని, లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరుగలేదంటూ ఆరోపిస్తుంది. రుణమాఫీ సమస్యలపై ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో నిరసనలకు దిగాలని నిర్ణయించుకుంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టాలని కేడర్‌కు సూచించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, 40% మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయకముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని లక్షలాది మంది రైతన్నలకు అండగా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఆందోళనలకు దిగాలని నిర్ణయించామన్నారు. రుణమాఫీపై సీఎం, మంత్రులు తలోరకంగా మాట్లాడుతు రైతులను మరింత గందరగోళ పరుస్తున్నారన్నారు. రుణమాఫీ సమస్యలపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ.. అందుకే ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నామని అన్నారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలని, అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదని కేటీఆర్ పేర్కోన్నారు.