దళితబంధు, రైతుబంధు బీఆరెస్ ఓటమికి కారణం!
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమిపై ఆ పార్టీ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆరెస్‌ను ప్రజలు తిరస్కరించలేదు
కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారు
దళిత బంధుతో ఇతర కులాల వారికి కోపం వచ్చినట్టుంది
భూస్వాములకు రైతుబంధును జనం హర్షించలేదు
ప్రజా తీర్పును తప్పుబట్టే వ్యాఖ్యలొద్దు
పార్టీని పట్టించుకోక ఎన్నికల్లో ఓడాం
అందుకు నాదే బాధ్యత
ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే పద్ధతికి చెల్లు
ఇక పార్టీ చుట్టూనే ఎమ్మెల్యే తిరిగాలి
బీజేపీతో గతంలోనూ పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ ఉండదు
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక భేటీలో కేటీఆర్ వ్యాఖ్యలు
విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆరెస్‌ను తిరస్కరించలేదని, రెండుసార్లు బీఆరెస్‌కు అవకాశమిచ్చామని ఈ దఫా కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారని మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పును తప్పుబట్టరాదని కేడర్‌కు హితవు పలికారు. శుక్రవారం ఆయన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ‘బీఆరెస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని అక్కడక్కడా పార్టీ శ్రేణులు ప్రజలతో సంభాషిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. అలా మాట్లాడటం, ప్రజా తీర్పును గౌరవించకపోవడం కరెక్ట్ కాదు’ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆరెస్‌కు బంపర్ మెజార్టీ ఇచ్చారన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు. ఓటములు బీఆరెస్‌కు కొత్త కాదని అన్నారు. ‘కారుకు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. కారు సర్వీసింగ్ వెళ్లింది. షెడ్డుకు కాదు’ అని వ్యాఖ్యానించారు. నిర్విరామంగా పదేళ్ల పాటు కారు పనిచేసిందని గుర్తుచేశారు. మరింత స్పీడ్‌గా దూసుకెళ్లేందుకు ప్రస్తుతం సర్వీసింగ్‌కు వెళ్లిందని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు పాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని, అందుకు తనదే బాధ్యతని కేటీఆర్ అంగీకరించారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాదు..
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని కేటీఆర్ అన్నారు. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. పథకాలపై ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా చేయలేకపోయామని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా దళితబంధు కొందరికే రావడంతో మిగిలిన వాళ్లు వ్యతిరేకమయ్యారని చెప్పారు. దళితబంధుపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించిందన్నారు.
భూస్వాములకు రైతుబంధును జనం హర్షించలేదు
భూస్వాములకు రైతుబంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు ఒప్పుకోలేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని ఎందుకు చూపించారో విశ్లేషించుకోవాలన్నారు. కొంతమంది కాంగ్రెస్‌కు ఓటేసి.. కేసీఆర్ సీఎం ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసిందని తెలిపారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో భిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలుస్తామనుకుని స్వల్ప తేడాలతో ఓడిన 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా వుండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు గతంలో లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చింది 420 హామీలే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని 420 హామీలు అని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్నికరపత్రంలా మాట్లాడించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలను, ఆరోపణలను దీటుగా తిప్పికొట్టామని చెప్పారు. ‘మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీర్చింది నిజం కాదా? ఇంటింటికీ మంచి నీళ్ళు ఇచ్చింది నిజం కాదా? పదేండ్లలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే, కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ వ్యహారిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయిందని, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని కేటీఆర్ అన్నారు. ఇక స్వయంగా కేసీఆరే అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరన్నారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి..ఇవాళ అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సరైన ప్రత్యామ్నాయం బీఆరెస్ మాత్రమేనన్నారు. నూతన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని అనుకుంటే.. కాంగ్రెస్ రెచ్చగొట్టే వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
బీఆరెస్ ఓటమిని సమీక్షించుకుని రాబోయే పార్లమెంటు ఎన్నికలను రెట్టించిన ఉత్సాహంతో ఎదుర్కోందామన్నారు. సమీక్ష సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాలను ఏరోజు కారోజు కేసీఆర్‌కు నివేదిస్తున్నామని తెలిపారు. భువనగిరి సీటుతో సహా మెజారిటీ స్థానాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆరెస్ మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా మిగతా 6 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.