కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేసిన ఖర్గే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శుక్రవారం విడుదల చేశారు

కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేసిన ఖర్గే
  • 42పేజీలు..66 అంశాలతో అభయ హస్తం పేరిట మ్యానిఫెస్టో
  • ఆరు గ్యారంటీలకు అదనంగా మ్యానిఫెస్టో హామీలు

విధాత : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శుక్రవారం విడుదల చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన మ్యానిఫెస్టో విడుదల చేశారు. అభయం హస్తం పేరుతో ఇందిరమ్మ రాజ్యం..ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రూపొందించిన 42పేజీల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆరుగ్యారంటీలకు అదనంగా 66 అంశాలను పొందుపరిచారు.


మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశామని, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.


మా తొలి లక్ష్యం.. మహాలక్ష్మి పథకం అని, ప్రతి నెలా 2500, 500కే గ్యాస్, బస్సుల్లో ఫ్ర్రీ జర్నీ సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ మేం నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలు తున్నారన్నారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు.



కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని, కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుందని, ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదన్నారు. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పటికే జనాలు డిసైడ్ అయిపోయారన్నారు. ఎప్పుడూ ఫామ్‌ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారని, జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.


టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మ్యానిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్‌, బైబిల్ అన్నారు. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారని, పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని, నమ్ముకున్నవారికి ద్రోహం చేశారన్ విమర్శించారు. పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారని, వెనక్కి తిరిగి చూసుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారన్నారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారని, కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.



మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దగా పడ్డ తెలంగాణ బిడ్డల కోసం మ్యానిఫెస్టో రూపోందించామన్నారు. అన్ని వర్గాల సంఘాలను, జిల్లాలలో పర్యటించి అన్ని వర్గాలు, సంఘాల అభిప్రాయాలను సేకరించి మ్యానిఫెస్టో హామీలు రూపొందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారటీలతో పాటు మ్యానిఫెస్టో హామీలను అమలు చేస్తుందన్నారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణలో మార్పుకు నాంది పలకాలన్నారు.