ఐదు సెక్టార్లలో మెట్రో అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

ఐదు సెక్టార్లలో హైదరాబాద్ మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మంగళవారం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ఐదు సెక్టార్లలో మెట్రో అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
  • సచివాలయంలో సమీక్ష
  • ప్రణాళికల రూపకల్పనకు ఆదేశాలు
  • మూసీ నది అభివృద్ధిపై సమీక్ష

విధాత : ఐదు సెక్టార్లలో హైదరాబాద్ మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మంగళవారం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో ఫేజ్ -2 పై అధ్యయనంపై త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్‌నామా వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సూచనలు అభ్యంతరాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మార్గంలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని సమన్వయం చేసుకోవాలన్నారు.


మియాపూర్-చందానగర్- బీహెచ్‌ఈఎల్‌-పటాన్ చెరువు (14 కి.మీ), ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా- చంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు-విమానాశ్రయం (23 కి.మీ), నాగోల్ -ఎల్‌బినగర్-ఒవైసీ హాస్పిటల్ – చాంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి- ఆరామ్‌గఢ్-కొత్త హైకోర్టు స్థలం రాజేంద్రనగర్‌లో ఎన్‌హెచ్‌(వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం పక్కనే) (19 కి.మీ.), కారిడార్-III రైదుర్గ్ స్టేషన్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (విప్రో సరస్సు జేఎన్‌/అమెరికన్ కాన్సులేట్) వరకు బయోడైవర్సిటీ జేఎన్‌, IIIT జేఎన్‌, ఐఎస్‌బీ రోడ్ (12 కి.మీ) ద్వారా పొడిగింపు, ఎల్‌బీ నగర్-వంస్థలిపురం-హయత్‌నగర్ (8 కి.మీ)లుగా ఐదు సెక్టార్‌లలో మెట్రో అభివృద్ధి జరుగాలన్నారు.


శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలని, మెట్రో ఫేజ్-III ప్రణాళికలు జేబీఎస్‌ మెట్రో స్టేషన్ నుంచి షామీర్‌పేట వరకు విస్తరించాలన్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తారామతిపేట నుండి నాగోల్, ఎంజీబీఎస్‌ (40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైల్‌ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు ప్రతిపాదనలు, అంచనాలతో నివేదిక సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మూసీ నది అభివృద్ధిపై సీఎం సమీక్ష

మూసీ నది అభివృద్ధి పై నానక్ రామ్ గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమీషనర్ ఆమ్రపాలి, సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు.