రేవంత్ కాలు పెడితే నాశనం: మంత్రి ఎర్రబెల్లి

రేవంత్ కాలు పెడితే నాశనం: మంత్రి ఎర్రబెల్లి
  • 27న పాలేరు, మానుకోట, వర్ధన్నపేటలో సభలు
  • సీఎం కేసీఆర్ రాక
  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘మీకో బ్రోకర్ దొరికిండు రేవంత్ రెడ్డి. బ్రోకర్ రాసిస్తే మీరు చెబుతండ్రూ… అసొంటి బ్రోకర్లు, ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనం. టిఆర్ఎస్ లో ఉన్నంత సేపు తెలంగాణ రాలేదు… తర్వాత టీడీపీలో చేరి నాశనం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని నాశనం చేస్తుండు… వాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనం… రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా దూషించారు. ఈ 27న మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం జిల్లా పాలేరు, 2 గంటలకు మహబూబాబాద్, 4 గంటలకు వర్ధన్నపేట బహిరంగ సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.


ఈ సభల నేపథ్యంలో సభాస్థలి, హెలిప్యాడ్ ఏర్పాట్లను మహబూబాబాద్, వర్ధన్నపేటలో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి వేర్వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్ ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ నాశనమన్నారు. రేవంత్ రెడ్డి మాటలు… తుపాకీ వెంకట్రాముడి ప్రగల్బాలతో పోల్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ నాశనం అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు మళ్ళీ కష్టాలేనని విమర్శించారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే, నట్టేట మునిగినట్లే అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, బానోత్ శంకర్ నాయక్, మార్నేని రవీందర్రావు, బిందు పాల్గొన్నారు.