అక్క‌డ ఇవ్వ‌నోళ్ళు .. ఇక్క‌డ ఎట్ల ఇస్తరు?: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్

అక్క‌డ ఇవ్వ‌నోళ్ళు .. ఇక్క‌డ ఎట్ల ఇస్తరు?: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్
  • కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలేవి?
  • ప్రతిపక్షాల ఎన్నికల హామీలపై
  • మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిలదీత


విధాత ప్రతినిధి,ఉమ్మడి ఆదిలాబాద్: ‘తెలంగాణ రాక ముందు మ‌న బతుకులు ఎట్లుండే. రాష్ట్రం వ‌చ్చినంకా మ‌న బ‌తుకులు ఎట్ల బాగుప‌డ్డాయో మ‌న‌ క‌ళ్ల ముందు క‌న‌ప‌డుతుంది. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలేవి? అక్క‌డ ఇవ్వ‌నోళ్ళు .. ఇక్క‌డ ఎట్ల ఇస్తరు?’ అంటూ మంత్రి, నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మామ‌డ మండ‌లం వాస్త‌వ‌పూర్ గ్రామంలో ప్రచారం చేశారు. స్థానికులు మంత్రికి అపూర్వ స్వాగ‌తం పలికారు. గుస్సాడీ నృత్యాలు, బ‌తుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో సందడిగా మారింది.


అంత‌కుముందు వాస్తవ‌పూర్ అంజ‌నేయ స్వామిని ద‌ర్శించుకుని మంత్రి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వృద్దులు, యువ ఓటర్ల‌ను క‌లుస్తూ ‘అభివృద్ధి ఆగ‌వ‌ద్దు, సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి” అంటూ అభ్య‌ర్థించారు. సీఎం కేసీఆర్‌ తోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని, మూడోసారి ప్రజలు బీఆర్ఎస్ కే ప‌ట్టం క‌ట్టాల‌ని కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో నిరుపేద‌ల‌కు వ‌రంగా ఉంద‌న్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తామ‌ని మాటిచ్చారు.


వాస్త‌వ‌పూర్ కు 25 ఏండ్ల క్రితం వ‌ర‌కు రోడ్డు లేకుండే. ఒక‌ప్పుడు ఈ ఊరుకు రావాలంటే ఒక రోజు ప‌డుతుండే. గ‌తంలోనే ఈ ఊరికి రహ‌దారి సౌక‌ర్యం క‌ల్పించాం. ప్రధాన రహ‌దారి నుంచి ఇక్క‌డికి మూడు నిమిషాల్లోనే వ‌స్తున్నం. క‌ల్మ‌షం లేని మనుషులు, కోప‌తాపాలు ఉండ‌వు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మీ ఊరికి వ‌చ్చి మీ ఆశీర్వాదం తీసుకోవం అనవాయితీ. అందుకే మీ ఊరికి వ‌చ్చిన‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు వేసి ఆశీర్వదించండి. ఎల్ల‌వేళలా మీకు అండ‌గా ఉంటా” అన్నారు.