యువతకు ఉద్యోగాలు సృష్టిస్తా: మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్ అని మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు

- ఇదే నా ముందున్న సవాల్
- ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత: సూర్యాపేట యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్ అని మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన యువకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అందమైన, సుందర పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. సూర్యాపేటలో శాంతిభద్రతల విషయంలో రాజీలేదన్నారు. గత పాలనలో, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పే బాధ్యత యువతదే అన్నారు.
రెండు ట్యాంక్ బండ్లు ఉన్న ఏకైక పట్టణం రాష్ట్రంలో సూర్యాపేటనే అన్న మంత్రి, మరోసారి ఆశీర్వదిస్తే, నెక్లెస్ రోడ్డుని తలపించేలా మూడవ టాంక్ బండ్ గా నల్లచెరువును మారుస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టు కేసుల పేరుతో నిరోధకులు అడ్డుపడినారాన్న మంత్రి, ఎన్ని అవాంతరాలు సృష్టించినా అభివృద్ధి లక్ష్యం ముందు అవి నిలబడలేదని అన్నారు. సూర్యాపేట అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టే బాధ్యతను యువతనే తీసుకోవాలన్నారు.
కారు గుర్తును గెలిపించుకుని భవిష్యత్తును నిర్మించుకుందాం అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పట్టణం నలవైపుల నుండి తరలివచ్చిన యువతకు మంత్రి ఉపన్యాసం సరికొత్త జోష్ నింపింది. సాయికుమార్, కాసం మని, అజయ్, వసంత్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరగ్గా, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, బత్తుల జానీ పాల్గొన్నారు.