బీజేపీ ఏజెంటు రేవంత్ రెడ్డి: మంత్రి కేటీఆర్

- బీజేపీది మేకప్.. కాంగ్రెస్ ది ప్యాకప్
- కామారెడ్డి బీఆర్ఎస్ సమావేశంలో మంత్రి కేటీఆర్
విధాత ప్రతినిధి, నిజామాబాద్: ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాదు. ఆరెస్సెస్ ప్రచారక్ గా పని చేశారు. ఆయన్ను ఆరెస్సెస్, బీజేపీ నాయకులే కాంగ్రెస్ లోకి పంపారు. బీజేపీ ప్రధాన ఏజెంట్ రేవంత్ రెడ్డి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10-12 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీలో చేరుతారు’ అని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో శనివారం మంత్రి రూ.8 కోట్లతో నిర్మించబోయే ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో దొంగగా ఉన్న రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ ఉందని, ఇప్పుడు సీటుకు రేటు ఫిక్స్ చేస్తున్నాడన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులు రేవంత్ రెడ్డిని.. రేటెంత రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అక్కడ విరాళాలు సేకరిస్తూ ఇక్కడికి పంపిస్తున్నారన్నారు.
115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన తర్వాత, అందరి దృష్టి కామారెడ్డి పైనే ఉందన్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ కు ఎనలేని అనుబంధం ఉందన్నారు. నెర్రెలు వారిన, నెత్తురు కారిన ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కేసీఆర్ పోటీకి కారణమని చెప్పారు. కామారెడ్డి ఉద్యమాల గడ్డ అని, ఒకప్పటి టీఆర్ఎస్ అడ్డా అని కొనియాడారు. ఇక్కడ నుంచి పోటీ ప్రకటన రోజే కేసీఆర్ గెలుపు ఖాయమైందని, ఇక మెజారిటీ కోసమే వెయిట్ చేస్తున్నామని, కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కనపెట్టి భారీ మెజారిటీ వచ్చేలా పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఇన్చార్జిగా సీనియర్ నాయకులను హోదాలు పక్కనపెట్టి పని చేయాలన్నారు. తనతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇక్కడ ఇంచార్జిలుగా ఉంటామని పేర్కొన్నారు. కేసీఆర్ గెలుపుతో ప్రతిపక్షాల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావాలన్నారు. కామారెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయాలని, అలాగే ప్రతి గ్రామం, వార్డు మేనిఫెస్టో తయారు చేయాలని సూచించారు.
ఆజాద్ తో పొత్తులో టికెట్ తెచ్చుకున్న షబ్బీర్ అలీ
మాజీ మంత్రి షబ్బీర్ ఆలీపై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 2004లో పొత్తులో భాగంగా గులాం నబీ ఆజాద్ వద్దకు వెళ్లి, పొత్తులో టికెట్ తనకే ఇచ్చేలా చూడాలని వేడుకుంటే షబ్బీర్ ఆలీకి కామారెడ్డి టికెట్ వచ్చిందన్నారు. నాడు టీఆర్ఎస్ కు ఉన్న ప్రజాదరణ దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని షబ్బీర్ అలీ గుర్తించారన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ను బతిమాలితే, ఇష్టం లేకున్నా కామారెడ్డి వచ్చి ప్రచారం చేస్తే షబ్బీర్ అలీ గెలిచి కరెంట్ మంత్రి అయ్యాడన్నారు. నాడు కరెంట్ మంత్రిగా మంచి చేసి ఉంటే నేడు ఈ కష్టం వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. ఇక్కడి బీజేపీ నాయకునికి ఓటమి ముందే అర్థమై, కేసీఆర్ పై పోటీ చేయడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అని స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు.
ప్రతి ఇంటికి కేసీఆర్ ఉత్తరం చేరాలి
నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందిన ప్రతి ఇంటికి కేసీఆర్ ఉత్తరం చేరాలని కేటీఆర్ అన్నారు. 4800 మంది బీడీ కార్మికులు, 63,399 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, ధాన్యం డబ్బులు పొందిన 69650 మంది రైతులు, రైతు బీమా పొందిన 1243 మంది రైతులు, రుణమాఫీ పొందిన 44018 మంది రైతులు, 12,309 మంది కళ్యాణలక్ష్మి, 2230 మంది షాది ముబారక్ లబ్ది దారులు, కేసీఆర్ కిట్ పొందిన 48,837 మందికి గర్భిణులు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పొందిన 3487 మంది లబ్ధిదారులకు కేసీఆర్ గెలుపు కోసం ఉత్తరం చేరాలని పిలుపునిచ్చారు.