ఢిల్లీ దొర‌ల‌కు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుత‌న్న పోరాట‌మిది: మంత్రి కేటీఆర్

ఢిల్లీ దొర‌ల‌కు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుత‌న్న పోరాట‌మిది: మంత్రి కేటీఆర్

దొర‌ల తెంగాణ కావాల్నా.. ప్ర‌జ‌ల తెలంగాణ కావాల్నా.. అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిజంగా ఈ రోజు జ‌రుగుతున్న పోరాటం.. న‌వంబ‌ర్ 30న ఢిల్లీ దొర‌ల‌కు, నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పంచాయితీ ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ జ‌ల‌విహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల స‌మ్మేళ‌నంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


1952లో ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టిందే ఈ ఢిల్లీ దొర రాహుల్ గాంధీ ముత్తాత జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ. 1952లో సిటీ కాలేజీ వేదిక‌గా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని నిన‌దించిన ఐదు మంది పిల్ల‌ల‌ను కాల్చి చంపింది ఈ ఢిల్లీ దొర రాహుల్ ముత్తాత‌. 1956లో ఇష్టం లేని పెళ్లి చేసింది కూడా ఢిల్లీ దొర నెహ్రూనే. 1968లో విద్యార్థులు, విద్యావంతులు, న్యాయ‌వాదులు, మేధావులు క‌లిసి ఖ‌మ్మం జిల్లాలో ఉద్య‌మం ప్రారంభిస్తే ఆ సంద‌ర్భంగా 370 మంది పిల్ల‌ల‌ను పిట్ట‌ల్లా కాల్చి చంపించింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ నాయిన‌మ్మ ఇందిర‌మ్మ‌.


1971లో తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ గుండెను చీల్చి, ఆత్మ‌ను ఆవిష్క‌రించి.. 11 ఎంపీలు సీట్లు మ‌ర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌జా స‌మితికి అప్ప‌గిస్తే.. వాళ్లంద‌రిని గొర్రెల మాదిరిగా గుంజుకుపోయి కాంగ్రెస్‌లో క‌లుపుకొని, ప్ర‌జ‌ల తీర్పును అప‌హాస్యం చేసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ నాయిన‌మ్మ ఇందిర‌. 2004 ఎన్నిక‌ల సంద‌ర్భంలో తియ్య‌టి మాట‌లు చెప్పి, తెలంగాణ ఇస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి, ప‌దేండ్లు చావ‌గొట్టి, వంద‌ల మంది ప్రాణాలు తీసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ త‌ల్లి సోనియా గాంధీ. ఇవ‌న్నీ వాస్త‌వాలు.. నేను చెప్ప‌ట్లేదు.


2014 దాకా ఢిల్లీ దొర‌ల‌తో కొట్లాడినం తెలంగాణ కోసం. 2014 త‌ర్వాత మ‌రొక దొర‌.. న‌రేంద్ర‌ మోదీతో కొట్లాడుతున్నాం. తెలంగాణ‌ను అవ‌మానించేలా మాట్లాడుతున్నారు. హైకోర్టు విభ‌జ‌న‌కు ఐదేండ్ల స‌మ‌యం తీసుకున్నారు. అది మాత్ర‌మే కాదు.. తెలంగాణ మెడ మీద క‌త్తి పెట్టి లొంగ‌దీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఈ దొర‌తోని కూడా కొట్లాడుతున్నాం. చావ‌నైనా చ‌స్తాం కానీ.. ఈ ఢిల్లీ దొర‌ల ముందు ఎట్టి ప‌రిస్థితుల్లో కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ త‌ల దించ‌దు. ఎందుకంటే మాకు ఆ చిత్త‌శుద్ధి ఉంది. తెలంగాణ సాధించిన బిడ్డలుగా రోషం, పౌరుషం ఉంది. ఈ స‌న్నాసుల ముందు ఎన్న‌టికీ త‌ల దించం.


ఒక బ‌క్క ప‌లుచ‌ని కేసీఆర్.. ఆయ‌న ఉన్న‌దే 52 కిలోలు.. ఆయ‌న‌ను ఢీకొట్టేందుకు అంద‌రూ ఒక్క‌టైతున్నారు. కేసీఆర్‌ను ఓడించ‌డమే నా జీవిత ల‌క్ష్య‌మ‌ని ష‌ర్మిల‌ ప్ర‌క‌టించారు. అందుకే నేను త‌ప్పుకుంటున్నా కాంగ్రెస్‌కు ఓటేయండి అని ష‌ర్మిల స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక చాలా మంది ఒక్క‌టి అవుతున్నారు. ఇవాళ ఒక్క‌టి మాత్రం ప‌క్కా.. 2014లో ఎవ‌ర్నీ న‌మ్ముకోలేదు.. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నాం. 2018లో కూడా ఎవ‌ర్నీ న‌మ్ముకోలేదు. ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నాం. 2023లో కూడా ప్ర‌జ‌ల‌న్ని న‌మ్ముకుంటున్నాం. మిమ్మ‌ల్ని మ‌న్ముకుంటున్నాం. సినిమా డైలాగ్ చెప్పాలంటే.. సింహాం ఎప్పుడూ సింగిల్‌గానే వ‌స్త‌ది. కేసీఆర్ సింహాం లాంటోడు.. సింగిల్‌గానే వ‌స్త‌డు.. మాకు విశ్వాసం ఉంది. మీ మీద‌, ప్ర‌జ‌ల మీద విశ్వాసం ఉంది. మా ప‌ని మీద మాకు విశ్వాసం ఉంది. ప‌ని చేశాం కాబ‌ట్టి బ‌రాబ‌ర్ ఓట్లు అడుగుతాం. త‌ప్పేముంది.


న్యాయ‌వాదుల‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన వాడు.. క‌రోనా స‌మ‌యంలో కాపాడుకున్న‌వాడు. 250 మంది అడ్వ‌కేట్ల‌కు స‌ముచిత గౌర‌వం క‌ల్పించిన ముఖ్య‌మంత్రి ఎవ‌రి మీద‌నో ఆధార‌ప‌డి ఎందుకు ఉండాలి. మోదీ, అమిత్ షా, 16 మంది ముఖ్య‌మంత్రులు, ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ అంత మంది వ‌స్తున్న‌రు మా మీదికి. కేసీఆర్ మ‌న నాయ‌కుడు.. కేసీఆర్ లాంటి నాయ‌కుడు ఉంటేనే ఈ తెలంగాణ సుర‌క్షితంగా ఉంటుంది.


తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థుల‌కు ధీటుగా అడ్వ‌కేట్లు ప‌ని చేశారు. ఉస్మానియా గేట్ల‌ను బ‌ద్ద‌లుగొట్టి విద్యార్థుల‌కు మ‌ద్ద‌తు తెలిపింది న్యాయ‌వాదులే. ఢిల్లీలో పార్ల‌మెంట్ ముట్ట‌డికి కేసీఆర్ పిలుపునిస్తే బారికేడ్లు ఎక్కి పోరాటం చేశారు. కొన్ని అనుభ‌వాలు మ‌రిచిపోలేనివి. ఉద్య‌మంలో భాగంగా సాయంత్రం రైల్ రోకో త‌ర్వాత‌ మౌలాలిలో అరెస్టు చేస్తే, రాత్రి ఒంటి గంట‌కు మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచేందుకు, తార్నాక ప్రాంగ‌ణంలోని రైల్వే జ‌డ్జి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఫైన‌ల్‌గా ఉద్య‌మ వేడికి జ‌డిసి ఆ న్యాయ‌మూర్తి అన్యాయం చేయ‌కుండా న్యాయం చేసి బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించాడు. తెలంగాణ ఉద్య‌మంలో మాకు మ‌నోస్థైర్యం ఇచ్చారు. న్యాయ‌స్థానాల్లో ఒక్క పైసా ఆశించ‌కుండా మాకు అండ‌గా నిల‌బ‌డ్డ న్యాయవాదుల‌కు శిర‌స్సు వంచి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.


రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగ‌ళూరుకు త‌ర‌లించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాయ‌డంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.


ఫాక్స్‌కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్ల‌కు సంబంధించిన అనేక ప‌రిక‌రాలు త‌యారు చేస్తోంది. చైనాలో 15 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించింది. మ‌నం క‌ష్ట‌ప‌డి నాలుగేండ్లు వెంబ‌డి ప‌డి తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఒప్పించుకున్నాం. వివిధ వేదిక‌ల్లో అమెరికా, చైనా తైవాన్‌లో క‌లిసిన త‌ర్వాత 2022లో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ హైద‌రాబాద్‌కు వ‌చ్చి సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఫ్యాక్ట‌రీ పెడుతాం అని ప్ర‌క‌టించారు. ఒక ల‌క్ష మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదురుగా కొంగ‌ర‌కొలాన్‌లో 200 ఎక‌రాల స్థ‌లంలో నిర్మాణం ప్రారంభించారు. రెండు అంత‌స్తులు పూర్త‌య్యాయి. వ‌చ్చే ఏప్రిల్, మే నెల‌లో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రారంభం కానుంది.


అయితే క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి అక్టోబ‌ర్ 25న లేఖ రాశారు. ఆపిల్ ఎయిర్ పొడ్స్ ఇండ‌స్ట్రీని హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు మార్చండి. తొంద‌ర‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌బోతోంది. హైద‌రాబాద్ నుంచి ప‌రిశ్ర‌మ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఒప్పించి బెంగ‌ళూరుకు త‌ర‌లిస్తాం. ఇందుకు తెలంగాణ‌లో ఉండే కాంగ్రెస్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంది అని డీకే శివ‌కుమార్ త‌న లేఖ‌లో పేర్కొన్న‌ట్లు కేటీఆర్ గుర్తు చేశారు.


అంటే కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోతే ఏం జ‌రుగుత‌ది అనే దానికి ఇది ఒక చిన్న ఉద‌హ‌ర‌ణ‌. ఢిల్లీ చేతిలో మ‌న జుట్టు ఇస్తే, కొట్లాడే మొన‌గాడు, తెలంగాణ ప్ర‌జ‌యోజ‌నాలు ప‌రిర‌క్షించే నాయ‌కుడు లేక‌పోతే ప‌రిస్థితి ఇలానే త‌యార‌వుతుంది. కాంగ్రెస్‌కు బెంగ‌ళూరు అడ్డా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో కాకుండా, బెంగ‌ళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయి. పైస‌ల‌న్నీ బెంగ‌ళూరులో దొరుకుతున్నాయి. సిద్ధార‌మ‌య్య‌, డీకే శివ‌కుమార్‌ క‌ష్ట‌ప‌డి సంపాదించిన పైస‌లు తెలంగాణ‌కు త‌ర‌లుతున్నాయి. అడ్డంగా దొరికిపోతున్నాయి. అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే.. ల‌క్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్ ప‌రిశ్ర‌మ‌ను బంద్ చేసి బెంగ‌ళూరుకు త‌ర‌లిస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.


2014లో తెలంగాణ ఏర్ప‌డ్డ నాడు.. ఆర్థిక ప‌రిస్థితి ఏందో అని కొన్ని వ‌ర్గాల్లో ఆందోళ‌న‌ ఉండేది. అపోహాలు, అనుమానాలు, ఉండేవి. నాటి ప‌రిస్థితి, నేటి ప‌రిస్థితి ఎలా ఉందో మీ అంద‌రూ చూస్తున్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ఎలా మారిందో మీ అంద‌రికీ తెలుసు. క‌రెంట్, సాగు,తాగు నీటి ప‌రిస్థితులును గుర్తు చేసుకోండి. ఈ మూడింటిని అధిగ‌మించాం. వైద్యం, విద్యాసంస్థ‌లు ఇలా చెబుతూ పోతే.. ప్ర‌తి రంగంలో గ‌ణ‌నీయ‌మైన గుణాత్మ‌క‌మైన మార్పు వ‌చ్చింది. మ‌న త‌ల‌స‌రి ఆదాయం తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్పుడు ల‌క్షా 14 వేలు ఉండే. ఇప్పుడు 3 ల‌క్ష‌ల 17 వేల‌కు చేరింది. మీకు ప‌రిపాల‌న చేయ‌డం వ‌చ్చా..? అని వెక్క‌రించిన వారికి కంగు తినిపిస్తూ మ‌న రాష్ట్రం అభివృద్ధిలో అగ్ర‌భాగాన ఉంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్ర‌క‌టించింది.


తెలంగాణ న‌మూనా అంటే స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ్మిళిత, స‌మ‌తుల్య‌ మోడ‌ల్. ప‌దాలు బాగున్నాయిని వాడ‌టం లేదు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న స‌మ‌తుల్య మోడ‌ల్ ఎక్క‌డా లేదు. చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు ఒక ఇమేజ్ ఉండేది. ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బ‌న్ ఇమేజ్‌ ఉండేది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ఒక ఇమేజ్ కోసం తాప‌త్ర‌య ప‌డ్డారు. ప్రో పూర్, ప్రో రూర‌ల్, ప్రో అగ్రిక‌ల్చ‌ర్ అన్నారు.


కానీ ఇవాళ కేసీఆర్ స‌ర్కార్‌లో అరుదైన స‌మ‌తుల్య‌త క‌న‌బ‌డుతుంది. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు పెరుగుతున్నాయి. మూడున్న‌ర కోట్ల మెట్రిక్ ట‌న్నుల‌కు పండించే స్థాయికి ఎదిగాం. అన్న‌పూర్ణ‌గా మారింది తెలంగాణ‌. 2014లో ఐటీ ఎగుమ‌తులు 56 వేల కోట్లు ఉండే. అక్క‌డి నుంచి 2 ల‌క్ష‌ల 41 వేల కోట్ల‌కు పెరిగింది. హైద‌రాబాద్, ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల్లో ఐటీని విస్త‌రించాం. ఐటీ ఉద్యోగుల సంఖ్య తెలంగాణ‌లో 10 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఒక వైపు వ్య‌వ‌సాయం, మ‌రో వైపు ఐటీని అభివృద్ధి చేశాం. ప‌రిశ్ర‌మ‌లు పెరుగుతున్నాయి.


ప‌ర్యావ‌ర‌ణం పెరుగుతుంది. హ‌రిత‌హారం ద్వారా 7.7 శాతం గ్రీన్ క‌వ‌ర్‌ను పెంచాం. గ్రీన్ బ‌డ్జెట్ పెట్టి, చ‌ట్టాలు చేసి చెట్లు కాపాడాల‌ని ఆదేశించాం. ఉద్యోగాలు పోతాయ‌ని హెచ్చ‌రించాం. భ‌విష్య‌త్ త‌రాల కోసం హ‌రితాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేశాం. ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా ఉండే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఎంక‌రేజ్ చేశాం. 24 వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించాం. ఆ విధంగా రూర‌ల్ డెల‌వ‌ప్‌మెంట్, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్, వ్య‌వ‌సాయం, ఐటీ, వెల్ఫేర్.. ఈ అరుదైన స‌మ‌తుల్య‌త క‌న‌బ‌డేది మ‌న తెలంగాణ‌లోనే మాత్ర‌మే.