స్థానిక సంస్థలపై బీఆరెస్ కపట ప్రేమ

గ్రామ పంచాయతీలకు నిధులివ్వాలంటూ కల్లబొల్లి మాటలతో కపట ప్రేమ ఒలకబోస్తున్న బీఆరెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా

స్థానిక సంస్థలపై బీఆరెస్ కపట ప్రేమ
  • సర్పంచ్‌లను వేధించిన చరిత్ర ఆ పార్టీదే
  • కృష్ణా ప్రాజెక్టులపైన రాజకీయ విమర్శలు
  • బీఆరెస్ నేతలపై మండిపడిన మంత్రి ఉత్తమ్

విధాత : గ్రామ పంచాయతీలకు నిధులివ్వాలంటూ కల్లబొల్లి మాటలతో కపట ప్రేమ ఒలకబోస్తున్న బీఆరెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా, సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించకుండా వారిని ఆత్మహత్యల పాలు చేసిన చరిత్ర మరిచిపోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఇరిగేషన్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో సీఎస్ఆర్ నిధుల నుండి 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం భవనం, 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్‌ ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల హక్కులను హరించి వారికి నిధులివ్వకుండా వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పిందన్నారు. కేసీఆర్ ఒక నియంతల వ్యవహరించాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా, నేరుగా ఢిల్లీ నుంచి పవర్ పైనన్స్ కార్పొరేషన్ నిధుల ద్వారా, దాదాపు 20 గ్రామాలకు పంచాయితీ భవనం కోసం 25లక్షలు, అంగన్వాడీ భవనం కోసం 10లక్షలు మంజూరు చేయించానన్నారు.


ఇదిలా ఉండగా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే విషయమై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బీఆరెస్ నేతలు రాజకీయ విమర్శలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పదేళ్లలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఏపీ డైవర్ట్ చేసుకున్నారన్నారు. ఏపీ వాళ్ళు 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతుంటే బీఆరెస్‌ నాయకులు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తెలంగాణకు వస్తుంటే కాదని, ప్రజాధనం దోచుకునే లక్ష్యంతో లక్ష కోట్లతో గోదావరి నీటిని వాడుకుంటామని కాళేశ్వరం కట్టారని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, వేలకోట్ల దోపిడికి బీఆరెస్ ప్రభుత్వం పాల్పడిందని, చేసిన ద్రోహాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బీఆరెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఏపీకి ఏడు మండలాలు పోయాయని ఉత్తమ్ తెలిపారు.