Raghava Constructions : క్యాబినెట్ సమావేశంలో టార్గెట్ పొంగులేటి? కొడంగల్ లిఫ్ట్ సెంటర్ పాయింట్..

ఖ‌మ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ‌ధ్య అంత‌ర్గ‌త విభేధాలు ఉన్నాయ‌నే వాద‌న‌లు ఉన్నాయి. నిన్నగాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన పొంగులేటికి కీల‌క‌మైన శాఖ‌లు కేటాయించ‌డం, ప్రాధాన్యం ఇవ్వ‌డంతో మ‌ల్లు భట్టి ఆగ్ర‌హంతో ఉన్నార‌ని అంటున్నారు.

Raghava Constructions : క్యాబినెట్ సమావేశంలో టార్గెట్ పొంగులేటి? కొడంగల్ లిఫ్ట్ సెంటర్ పాయింట్..
  • కొడంగ‌ల్ లిఫ్ట్ ప‌నులు పొంగులేటి కొడుకు సంస్థ‌కు
  • అభ్యంత‌రం తెలిపిన ఉత్త‌మ్‌, భ‌ట్టివిక్ర‌మార్క‌

Raghava Constructions :  కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌. సాగునీటి ప్రాజెక్టుల అంచ‌నాలు, కాంట్రాక్టుల‌పై గురువారం జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో తీవ్రంగా వాదోప‌వాదాలు చోటు చేసుకున్నాయ‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు పొక్కాయి. ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన‌ స‌మావేశంలో మంత్రులే కీచులాడుకున్నార‌న్న వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిగ్‌గా మారాయి. అదికూడా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని రెండు ప్రాజెక్టుల‌పైనే ర‌చ్చ జ‌రిగింద‌ని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి క‌ల‌ల ప్రాజెక్టు నారాయ‌ణ‌పేట – కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని రూ.4,350 కోట్ల‌తో రెండు ద‌శ‌ల్లో నిర్మించత‌ల‌పెట్టారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ప‌రిపాల‌నా అనుమ‌తులు కూడా మంజూర‌య్యాయి. కొడంగ‌ల్, నారాయ‌ణ‌పేట‌, మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో సుమారు ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరు అందించాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ ఎత్తిపోత‌ల ప‌నుల కాంట్రాక్టును రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి కేటాయించ‌డంపై మంత్రులు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తున్న‌ది. మంత్రి కుమారుడి ఆధ్వ‌ర్యంలోని రాఘ‌వ క‌న్స‌స్ట్ర‌క్ష‌న్ కు ఏ ప్రాతిపదిక‌న ప‌నులు అప్ప‌గించార‌ని ప్ర‌తిప‌క్ష బీఆరెస్ ప్ర‌శ్నిస్తున్న‌ది. జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఉద్ధండాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌ను రూ.430 కోట్ల నుంచి రూ.1,150కు అంచ‌నాలు స‌వ‌రించడంపైనా క్యాబినెట్‌లో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం. సుదీర్ఘంగా ఆరు గంట‌ల పాటు సాగిన‌ స‌మావేశంలో ఈ రెండు ప్రాజెక్టుల‌పై మంత్రుల మ‌ధ్య వాదోప‌వాదాలు చోటుచేసుకున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

పొంగులేటితో పొస‌గ‌ని భ‌ట్టి?
ఖ‌మ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ‌ధ్య అంత‌ర్గ‌త విభేధాలు ఉన్నాయ‌నే వాద‌న‌లు ఉన్నాయి. నిన్నగాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన పొంగులేటికి కీల‌క‌మైన శాఖ‌లు కేటాయించ‌డం, ప్రాధాన్యం ఇవ్వ‌డంతో మ‌ల్లు భట్టి ఆగ్ర‌హంతో ఉన్నార‌ని అంటున్నారు. పార్టీని న‌మ్ముకుని ప‌నిచేస్తున్న త‌న‌లాంటి వారిని కాద‌ని జిల్లాలో ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి స్థాయి ప్రాధాన్యం ఇవ్వ‌డంపై ఆయ‌న గుర్రుగా ఉన్నార‌ని స‌మాచారం. ఇదే అద‌నుగా నారాయ‌ణ‌పేట – కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, ఉద్ధండాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల అంచ‌నాల సవ‌ర‌ణ‌ను మ‌ల్లు భ‌ట్టి తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్లు తెలిసింది. మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ క‌న్స‌స్ట్ర‌క్ష‌న్స్‌కు పనులు ఎలా అప్ప‌గిస్తార‌ని ఆయ‌న లేవ‌నెత్తార‌ని స‌మాచారం. ఇదే అద‌నుగా నీటి పారుద‌ల శాఖ మంత్రి ఎన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ని చెబుతున్నారు. అదే విధంగా ఉద్ధండాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల విలువ‌ను రూ.430 కోట్ల నుంచి రూ.1,150 కోట్ల‌కు ఎలా పెంచార‌ని, ప్రాతిప‌దిక ఏంట‌ని లేవ‌నెత్తారు. మూడింత‌లు పెంచేందుకు తీసుకున్న ప్రామాణిక అంశాలేంట‌ని అడ‌గ‌డంతో, మిగ‌తా మంత్రులు గుంభ‌నంగా ఉండిపోయారు. సవ‌రించిన అంచ‌నాల‌ను త‌గ్గించాల్సిందేన‌ని, లేదంటే ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తాయ‌ని వారు వాదించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఈ రెండు అంశాల‌పై బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్షం నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ తూర్పార‌బ‌ట్టారు. క్యాబినెట్ స‌మావేశమా? లేక‌, మంత్రుల కుస్తీ పోటీనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సిన క్యాబినెట్‌లో ఇవేం పంచాయితీల‌ని ఆయ‌న మండిప‌డ్డారు.