రేపు ‘సేవ్ కాంగ్రెస్’ పాదయాత్ర: బత్తుల లక్ష్మారెడ్డి
‘సేవ్ కాంగ్రెస్ - సేవ్ మిర్యాలగూడ కాంగ్రెస్’ నినాదంతో మంగళవారం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘సేవ్ కాంగ్రెస్ – సేవ్ మిర్యాలగూడ కాంగ్రెస్’ నినాదంతో మంగళవారం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో బత్తుల మాట్లాడారు. మిర్యాలగూడ పార్టీ టికెట్ ను ఏకాభిప్రాయంతో కేటాయించాలనే డిమాండ్లతో ఈ యాత్ర చేపట్టామన్నారు.
ఈనెల 17న ఉదయం 6 గంటలకు దామరచర్ల మండలం రాళ్లవాగుతండా రాగ్యనాయక్ విగ్రహం నుండి మిర్యాలగూడ పట్టణం రాజీవ్ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. కొందరు కాంగ్రెస్ సీనియర్లు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులను మభ్య పెడుతున్నారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బతికించేందుకు, కార్యకర్తల్లో ప్రలోభాలను తొలగించేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ శ్రేణుల విన్నపాలు బేఖాతరు చేస్తే, కార్యాచరణ అప్పుడే ప్రకటిస్తామన్నారు. పొత్తులతో సంబంధం లేకుండా మిర్యాలగూడ టికెట్ ను కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలన్నారు. కొన్ని రోజుల నుంచి సీపీఎం కు టికెట్ కేటాయిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని, అపోహలను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు పందిరి అనిత, కొమ్మన నాగలక్ష్మి హెచ్చరించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ బలంగా ఉందని, పొత్తు వద్దని బ్లాక్, పట్టణ, కాంగ్రెస్ అధ్యక్షులు పొడీల శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ బెజ్జం సాయీ కౌన్సిలర్ కొమ్మ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. బ్లాక్ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్, ఎంపీటీసీ బెజ్జం సాయి, సర్పంచులు అంజిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్రెడ్డి, యాదగిరిరెడ్డి, క్రికెటర్ జానీ, రుణాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ నాగునాయక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.