భూముల పరిరక్షణకు గ్రామంలో ఆ నలుగురు..!
గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థను బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కారు శరవేగంగా అడుగులేస్తోంది

- ప్రతిగ్రామంలో రెవెన్యూ, పంచాయతీ, వ్యవసాయ కార్యదర్శులతోపాటు
- శాంతి భద్రతలకు మరొక అధికారి!
- భూ పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగం
- గ్రామ స్థాయిలో అధికారుల వ్యవస్థ
- సమస్య గుర్తించి పై అధికారుల దృష్టికి!
- తద్వారా మండల స్థాయిలోనే పరిష్కారం
- తాసిల్దార్లకు అధికారాలిచ్చే ఇచ్చే యోచన
- భారం లేకుండా యంత్రాంగం సర్దుబాటు
- కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం?
- తప్పులు సరిచేసే పనిలో రేవంత్‌రెడ్డి!
విధాత: గ్రామస్థాయిలో పరిపాలన వ్యవస్థను బలోపేతం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు శరవేగంగా అడుగులేస్తోంది. గ్రామాల ప్రజలకు చెందిన అన్నిరకాల సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందేలా చేయడమే లక్ష్యంగా ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాటి కేసీఆర్ సర్కారు తీసుకు వచ్చిన ధరణి చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు తరువాత భూమి సమస్యలు విపరీతంగా పెరిగాయి. తాసీల్దార్లకు, ఆర్డీవోలకు అప్పటి వరకూ ఉన్న అధికారాలు పోయాయి. వీఆర్వో వ్యవస్థ రద్దయింది. వీఆర్ఏలనూ తీసి వేశారు.
దీంతో గ్రామాల్లో భూములకు సంబంధించి ఆయా సమస్యలను పరిశీలించి తాసీల్దారుకు నివేదిక ఇచ్చేందుకు గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి అనేవారే లేకుండా పోయారు. దీంతో ఏ భూమిలో ఎవరున్నారు? భూముల సరిహద్దు సమస్యలు, రికార్డుల నిర్వహణ, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణ లాంటి వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీనికి తోడు వచ్చిన సమస్యను మండల స్థాయిలో పరిష్కరించే అధికారాలను కూడా నాటి ప్రభుత్వం తీసివేసింది. దీంతో భూమికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మీ-సేవలో దరఖాస్తు చేసుకోవడం, లేదంటే కోర్టుకు వెళ్లడం మినహా మరో మార్గం లేని దుస్థితిని లక్షల మంది రైతులు ఎదుర్కొంటున్నారు. దీంతో సమస్యలన్నీ జటిలంగా మారాయి.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అగాధం
మండలస్థాయిలో ప్రభుత్వ అధికారులకు ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారం లేకుండా పోయింది. గ్రామస్థాయిలో అధికార వ్యవస్థ రద్దయింది. దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడింది. ఈ అగాధమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ప్రభుత్వం ఓటమిపాలు కావడానికి ప్రధాన కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే రైతులు గుంట భూమి కోసం కూడా హైకోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో తీసుకున్న అతిపెద్ద పొరపాటు నిర్ణయంగా భూమి వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా తాసిల్దార్‌నే గుర్తిస్తారు.
రేషన్ కార్డుల జారీ, ఆదాయం, కుల ధృవీకరణ సర్టిఫికెట్లు, భూమి పరిరక్షణ, భూమి సమస్యలతో పాటు 44 రకాల విధులను తాసిల్దార్ నిర్వర్తించేలా జాబ్ చాట్‌ను ప్రభుత్వమే రూపొందించింది. ఇలా మండలస్థాయిలో ప్రభుత్వ అధికారిగా తాసిల్దారే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తాసిల్దార్లు గ్రామస్థాయిలో పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేసేది గ్రామ స్థాయి రెవెన్యూ అధికారికే. అలాంటి కీలకమైన అధికారులు గ్రామ స్థాయిలో లేకపోవడంతో గ్రామ స్థాయి పరిపాలన కుటుపడింది. మండల స్థాయిలో తాసిల్దారుకు నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడం ప్రజలకు శాపంగా పరిణమించింది. ఇది గత ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించింది.
తప్పులు సరిచేసే పనిలో రేవంత్‌రెడ్డి సర్కార్!
బీఆరెస్ ప్రభుత్వం తీసుకున్నప్రజా వ్యతిరేక నిర్ణయాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కారు వడివడిగా అడుగులేస్తున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ సర్కారు చేసిన ప్రత్యేక చట్టం తరువాత.. ఉన్న అధికారులను తీసి వేసి, పర్యవేక్షణ చేసే నాథుడే లేకుండా పోయింది. దీనికి భిన్నంగా చట్ట సవరణ చేసి గ్రామస్థాయిలో అధికార వ్యవస్థను పట్టిష్టం చేయాలన్న దృఢ నిశ్చయంతో రేవంత్ సర్కారు ఉన్నదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏ సమస్య వచ్చినా గ్రామస్థాయిలో పరిష్కారం కావాలని, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భావిస్తోందని సమాచారం.
ఈ మేరకు రెవెన్యూ వ్యవస్థపై రేవంత్ సర్కారు కేంద్రీకరించింది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందించే రెవెన్యూశాఖను బలోపేతం చేసే దిశగా శరవేగంగా ప్రణాళిక సిద్ధమవుతున్నదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు గ్రామస్థాయిలోఒక రెవెన్యూ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ అధికారి, శాంతి భద్రతల నిర్వహణకు ఒక అధికారిని నియమించాలన్న నిర్ణయానికి రేవంత్ సర్కారు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గ్రామస్థాయిలో పిటిషన్ల పరిశీలన.. ఉన్నతాధికారులకు నివేదన!
గ్రామస్థాయిలో వచ్చే పిటిషన్లపై సదరు అధికారులు పరిశీలించి తాసిల్దార్‌కు నివేదిక ఇస్తే.. ఆ నివేదిక ఆధారంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో క్రాస్ చెక్ చేయించి, సమస్యలను పరిష్కరించే అధికారం తాసిల్దార్లకు అప్పగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం గ్రామస్థాయిలో వ్యవస్థ పటిష్టానికి ఆర్థికశాఖపై భారం పడకుండా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ముఖ్యంగా గ్రామస్థాయిలో అధికారులకు ఉండే అర్హతలను నిర్ణయించి, ఇందులో ఫిట్ అయ్యే అధికారులను ఆయా గ్రామాలకు పంపించాలన్న దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే వివిధ శాఖలకు వెళ్లిన 22 వేల మంది వీఆర్ఏలతోపాటు, వీఆర్వోలు ఉన్నారు. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ అధికారులు ఉన్నారు. వీరందరినీ హేతుబద్ధీకరిస్తే గ్రామాలకు కావాల్సిన అధికారులు వస్తారని ఒక అంచనా ఉన్నది. గ్రామ స్థాయిలో అధికార వ్యవస్థ వస్తే పంటల ఎన్యూమరేషన్, పహణీ రికార్డు రూపకల్పన, ప్రభుత్వ భూముల సంరక్షణ, భాగ పంపకాలు చేయడం లాంటి కీలకమైన సేవలు త్వరిత గతిన ప్రజలకు అందుతాయని రేవంత్ సర్కారు భావిస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు.