మోదీకి గుర్తురాని మేడిగ‌డ్డ‌!.. బ‌రాజ్ కుంగుబాటు ప్ర‌స్తావ‌నే లేదు

మోదీకి గుర్తురాని మేడిగ‌డ్డ‌!.. బ‌రాజ్ కుంగుబాటు ప్ర‌స్తావ‌నే లేదు
  • కేసీఆర్ అవినీతిపై ప్ర‌ధాని ఆగ్ర‌హం
  • అదే బాట‌లో జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌
  • కాళేశ్వ‌రం ప్రాజెక్టు చెంత‌కూ వెళ్లీ
  • మేడిగ‌డ్డ‌ను ఊసెత్త‌ని సీఎం కేసీఆర్‌
  • నేత‌ల మౌనంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు
  • వ్యూహాత్మ‌క మౌనంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మ‌రో విడుత ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. మేడిగ‌డ్డ బ‌రాజ్ కుంగుబాటును ప్ర‌ధానంగా ప్ర‌స్తావించి.. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తార‌ని భావించినా.. ఆయ‌న ఆ ఊసే ఎత్త‌క‌పోవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతున్న‌ది. మేడిగ‌డ్డ ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో ప‌నికిరాద‌ని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పినా.. నివేదిక హ‌డావుడిగా రూపొందించార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వాదించినా.. ఈ అంశం ఎన్నిక‌ల వేళ ప్ర‌తిప‌క్షాల‌కు మాత్రం ప్ర‌ధాన అస్త్రంగా అందివ‌చ్చింది. కాంగ్రెస్ దీనిని త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్న‌ది. రాహుల్‌గాంధీ త‌న ప‌ర్య‌ట‌న‌ను పొడిగించుకుని మ‌రీ మేడిగ‌డ్డ‌ను సంద‌ర్శించి.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే మోదీ సైతం కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై గ‌ట్టిగా మాట్లాడుతార‌ని అతా భావించారు. కానీ.. బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పార్టీల‌ని, స్వంత ప్రయోజన పార్టీల‌ని విమ‌ర్శించిన మోదీ.. మేడిగ‌డ్డ బ‌రాజ్ కుంగిన అంశాన్ని క‌నీసంగానైనా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌ల్గించింది.


రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున బీసీ గర్జన పేరుతో మంగళవారం బీజేపీ భారీ సభ నిర్వహించింది. ఈ సభకు ముందు రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రధాన రాజకీయ పార్టీ ప్రతినిధిగా మోదీ మేడిగడ్డపై స్పందించాల‌ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై విరుచుకుపడిన మోదీ.. దోచుకున్న ధనాన్ని కక్కిస్తామంటూ చెప్పుకుంటూ పోయారే త‌ప్ప‌.. మేడిగ‌డ్డ‌ను ఎందుకు ట‌చ్ చేయ‌లేద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆఖ‌రుకు టీఎస్‌పీఎస్పీ ప‌రీక్ష ప‌త్రాల లీకేజీ ఉదంతాన్ని ప్ర‌శ్నించిన మోదీ.. కీల‌క‌మైన ప్రాజెక్టు అంశాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం వెనుక కార‌ణాలేమై ఉంటాయ‌న్న చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతున్న‌ది. ఎన్నికల వేళ బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రధానిని పొగిడేందుకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ఆయన కూడా మేడిగడ్డ ప్రాజెక్టుపై స్పందించకపోవడం గమనార్హం. మంగళవారం మేడిగడ్డ సమీపంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ సైతం దీనిపై స్పందించకపోవడానికి రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటే రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కూడా దీనిపై మాట్లాడకపోవడం కొసమెరుపని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మంథని గడ్డ పైన సీఎం మౌనం

తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ బ‌రాజ్‌ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసెత్తకపోవడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. మేడిగడ్డ నిర్మాణం జరిగిన గడ్డకు సమీపంలోని మంథని నియోజకవర్గంలో మంగళవారం భారీ ఎన్నికల సభ నిర్వహించి ఆ విషయం ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మొన్నటి వరకు ప్రతీ సభలో కాళేశ్వరం నీళ్ళు, రెండు పంటలకు నీళ్ళు, ధాన్యం దిగుబడి పెరిగిన తీరును పదేపదే ప్రజలకు వివరించిన కేసీఆర్.. మేడిగడ్డ బ‌రాజ్‌ పిల్లర్ కుంగుబాటు తర్వాత ఇప్పటి వరకు స్పందించలేదు. నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ బృందం బరాజ్ ను పర్యటించి తన నివేదికను బహిరంగ పరిచిన‌ విషయం తెలిసిందే. నివేదికలో ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో ఉందంటూ స్పష్టం చేసింది.


దీనికి ప్రభుత్వం పక్షాన నీటిపారుదల శాఖ లేఖ రాసింది తప్ప విమర్శల పై సీఎంగా కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎన్నికల సందర్భంలో విపక్షల విమర్శలకు జవాబు చెప్పేందుకైనా బీఆర్ఎస్ అధినేతగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. కానీ, మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, పగుళ్ళు వెలుగు చూసిన గత నెల 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరిగిన బహిరంగ సభల్లో మేడిగడ్డ ఊసు లేక పోవడం ఆసక్తికరమైన అంశం. అప్పటి కాళేశ్వరం ఘనత, ప్రతీ పల్లెకు నీళ్ళిచ్చిన ఘనత అనే అంశాలు తన ఉపన్యాసంలో లేక పోవడం మరో విశేషం. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో సభ నిర్వహించి దాని గురించి మాట్లకపోవడమంటే మేడిగడ్డ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఇబ్బందికరంగా పరిణమించిదోననే అర్థ‌మ‌వుతున్న‌ద‌ని రాజ‌కీయ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సంఘటన పై చర్చకు అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మక మౌనం పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందనే ఎత్తుగడతో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.