అంతర్ రాష్ట్ర కార్మికులు ఆరోగ్యంకై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
విధాత,నల్లగొండ : అంతర్ రాష్ట్ర కార్మికులు ఎవరూ కూడా ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న4,000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే స్థానికులతో సమానంగా అంతర్ రాష్ట్ర కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ప్రాంగణంలో కోటి […]

విధాత,నల్లగొండ : అంతర్ రాష్ట్ర కార్మికులు ఎవరూ కూడా ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న4,000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే స్థానికులతో సమానంగా అంతర్ రాష్ట్ర కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు.
వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ప్రాంగణంలో కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 30 పడకల దవాఖానను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2022 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి చేసి నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభించిన ఈ పవర్ ప్లాంట్ కు కరోనా మహమ్మారి అవాంతరంగా మారిందన్నారు.
కరోనా మహమ్మారితో భయాందోళనకు గురైన కార్మికులు వాపస్ వెళ్లి పోయారని. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ స్పందించి ప్లాంట్ ప్రాంగణంలో 30 పడకల దవాఖాన నిర్మించాలని అదేశించారన్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టిన ఏజెన్సీ నెల రోజుల వ్యవధిలోనే దవాఖాన పూర్తి చేశారని. దాంతో నాలుగు వేల మంది కార్మికులు తిరిగి పనులలోకి వచ్చారన్నారు.
కొవిడ్ తో సహా ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా సిబ్బందిని నియమించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 1000 మంది కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డైరక్టర్ జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.