కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు.. నిరుద్యోగులకేమో ఆత్మహత్యలు: ప్రియాంక గాంధీ

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు

కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు.. నిరుద్యోగులకేమో ఆత్మహత్యలు: ప్రియాంక గాంధీ
    • యువతకు జాబ్‌ రావాలంటే కేసీఆర్‌ జాబ్‌ పోవాలి
  • కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏటా జాబ్‌ క్యాలెండర్‌
  • ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఇస్తే.. లాభపడింది ఒక్క కేసీఆర్‌ కుటుంబమే
  • నాటు నాటు డ్యాన్స్‌ చేస్తున్న బీజేపీ, బీఆరెస్‌
  • వారి కనుసన్నల్లో నడిచే ఎంఐఎం పార్టీ
  • ఆ మూడు పార్టీల విధానాలు ఒక్కటే
  • కాంగ్రెస్‌ను గెలిపిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు
  • ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ సభల్లో ప్రియాంక

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్:

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని, ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పీకేస్తేనే యువతకు ఉద్యోగాలొస్తాయని చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో, అనంతరం ఆసిఫాబాద్ నియోజవర్గంలో ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్షలకు పక్కా ప్రణాళిక ప్రకారం సిద్ధం కావచ్చని అన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పి.. గెలవగానే విస్మరించారని దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్సీ పేపర్లు లీక్‌ అవుతున్నాయని, ఫలితాలు వస్తాయో రావో అన్న పరిస్థతి తలెత్తుతున్నదని చెప్పారు. యువతకు జాబ్‌ కావాలంటే కేసీఆర్‌ జాబ్‌ పోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా ఆకాంక్షలకు మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకపోగా కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రావని ఆత్మస్థైర్యం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రియాంక హామీ ఇచ్చారు.

బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం నాటు డ్యాన్స్‌

బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలూ ఒకటేనని ప్రియాంక విమర్శించారు. బీఆరెస్‌కు తెలంగాణలో బీజేపీ సపోర్ట్ చేస్తుందని, బీజేపీకి ఢిల్లీలో బీఆరెస్‌ మద్దతు ఇస్తుందని చెప్పారు. వీరిద్దరి కనుసన్నల్లో ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించారు. ఈ ముగ్గురి విధానాలు ఒకటేనని, త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు అనే పాట లాగా ఉందని ఎద్దేవా చేశారు. నాటు నాటు పాట చూసి ఆనందించాలి తప్ప పొరపాటున వారిని నమ్మకూడదని అన్నారు. బీజేపీకి బీఆరెస్‌కు ఎంఐఎం తమ్ముడి లాంటి పార్టీ అని ఎద్దేవా చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే నల్ల చట్టాల విషయంలో బీజేపీకి బీఆరెస్‌ ప్రభుత్వం మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు బీజేపీ మద్దతు పలికితే.. ఢిల్లీలో బీజేపీకి బీఆరెస్‌ మద్దతు పలుకుతున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినా.. బీజేపీ మాత్రం ప్రశ్నించదని అన్నారు. అంతర్గతంగా రెండు పార్టీలూ ఒక్కటేనని విమర్శించారు.

ఇందిరమ్మ ఇప్పటికీ మీ మనసులో

ఇందిరాగాంధీ చనిపోయి 40 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆమె ఇప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో ఉన్నారని ప్రియాంక అన్నారు. ఇందిరాగాంధీ చేసిన సంక్షేమ పథకాల వల్లే ఈ రోజు కూడా ఆమెను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. నిరుపేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఆదివాసీలు, గిరిజనులు జల్ జంగిల్ జమీన్ అంటూ పోరాటం చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని అన్నారు. ఆదివాసీ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీలు, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పట్టాలను అందజేసి గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పారు. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అంతే బాధ్యతగా పరిపాలన కొనసాగించామని తెలిపారు.

వెనుకబడిన తెలంగాణ

కేసీఆర్ 10 ఏళ్ల పాలనాకాలంలో తెలంగాణ వెనుకబాటు గురైందని ప్రియాంకగాంధీ అన్నారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని ధరలు పెంచారని ఆరోపించారు. ఫలితంగా నిరుపేదలు బతకడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయని హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ మూలంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. దాని స్థానంలో భూ భారతి తీసుకువచ్చి రైతుల భూమికి భద్రత కల్పిస్తామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వ్యక్తులు తీసుకున్న రుణాలు మాఫీ చేశారని, పేద రైతులకు మాత్రం ఎలాంటి ఊరట లేదని పేర్కొన్నారు.

ఆరు గ్యారెంటీల అమలు గ్యారెంటీ

రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఆదివాసీలు, గిరిజనులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించలేదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం గత పదేళ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌ కుంభకోణాలపై కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ నాయకులపైకి మాత్రం ఈడీ, సీబీఐలను పంపిస్తారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి.. పూర్తిస్థాయిలో ఇవ్వలేదని విమర్శించారు. పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలే ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రియాంక చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్కామ్ జరిగిందని, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేస్తున్నామని ప్రియాంక స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎన్నికల హామీలు అమలు కావడం లేదని కేసీఆర్ అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ సమస్యలపై మాట్లాడకుండా.. పొరుగు రాష్ట్రంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ట్రైబల్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసి గృహ వసతి కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడమ బొజ్జను, ఆసిఫాబాద్‌ కాంగ్రెస్ అభ్యర్థి శ్యాం నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్‌ మ్యాచ్‌ నడుస్తున్నప్పటికీ.. తనను ఆదరించి బహిరంగ సభకు వచ్చిన ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.