విభజన చట్టం హామీల సాధనకు కేంద్రంపై పోరాటం
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, విభజన హామీల సాధనకు కేంద్రంపై టీజేఎస్ పోరాటం కొనసాగిస్తుందని కోదండరామ్ స్పష్టం చేశారు

- రాష్ట్రంలో మార్పు వచ్చింది..ఢిల్లీలోనూ మార్పు రావాలి
- నియంత పోకడలతోనే ఓటమని బీఆరెస్ నేతలు గ్రహించడంలేదు
- టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
విధాత : రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, విభజన హామీల సాధనకు కేంద్రంపై టీజేఎస్ పోరాటం కొనసాగిస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తోన్న వివక్షను తెలియజేసేందుకు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నరు. ఈ నెల 21న ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం మేం ఎప్పటికీ నిలబడి ఉంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పని చేస్తున్నారని, రాష్ట్రంలో పాలన మార్పు వచ్చిందని, ఢిల్లీలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు.
తెలంగాణలో ఇప్పుడు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకోగలుగుతున్నామన్నారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు. ఆంక్షలు బద్దలయ్యాయని.. ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తోందన్నారు. బీఆరెస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందన్నారు. నాలుగో తేదీలోగా జీతాలు వస్తున్నాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసినవారిపై కేసులు పెట్టిందన్నారు. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులు ఎత్తి వేయాలన్నారు. ఉద్యమ కేసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలు నియంతృత్వాన్ని ఓడించాలని పోరాటం చేశారని, దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఎట్టకేలకు నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విజయం సాదించామన్నారు. నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణమని ఇప్పటికీ బీఆరెస్ నేతలు గుర్తించలేకపోతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రధాని మోదీ తప్పుబట్టారని, ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ మీద కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికలనలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని కాజీపేట రైల్వే వ్యాగన్ ప్యాక్టరీకి శంకుస్థాపన చేశారన్నారు. భద్రాచలం రాములవారి ఆలయానికి భద్రత లేకుండా పోయిందని, ఈ ఆలయ అభివృద్ధిపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు.