తెలంగాణతో మాది కుటుంబ బంధం

తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ బంధం అని, రాజకీయాల కంటే అతీతమని, ఇందిరాగాంధీకి ఆపదలో ఉన్న ప్రతిసారి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని దీనిని తామెన్నడు మరిచిపోలేమని రాహుల్‌ అన్నారు

తెలంగాణతో మాది కుటుంబ బంధం
  • ఢిల్లీలో మీ కోసం మేమిద్దం సిపాయిలుగా ఉన్నాం
  • మల్కాజిగిరి రోడ్ షోలో రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు

విధాత : తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ బంధం అని, రాజకీయాల కంటే అతీతమని, ఇందిరాగాంధీకి ఆపదలో ఉన్న ప్రతిసారి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని దీనిని తామెన్నడు మరిచిపోలేమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లికి మద్దతుగా సోదరి ప్రియాంకగాంధీ, రాజస్థాన్ సీఎం అశోగ్ గెహ్లాట్‌, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ తెలంగాణ కోసం నేను, మా చెల్లి ఢిల్లీలో సిపాయిలుగా ఉన్నామని, మీకు ఏదైనా కావాలంటే, నన్ను, నా సోదరిని ఆర్డర్ చేయండని, మేము తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన చేయగలిగిన సహాయం చేస్తామన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇందిరా హాయం నుంచి మా కుటుంబానికి మద్దతుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. నేను, నా సోదరి మీతో కుటుంబ పరమైన హృదయ సంబంధాన్ని కోరుకుంటున్నామన్నారు.


హైద్రాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయని రాహుల్ గాంధీ వివరించారు. హైదరాబాదును విశ్వనగరంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడం కోసం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్ ప్రెస్ హైవే, మెట్రో రైల్ కాంగ్రెస్ నిర్మించనవేనన్నారు. బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, ఐడీపీఎల్‌, హెచ్‌ఎంటీ, హెచ్‌ఐఎల్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి సంస్థలను కాంగ్రెస్ ఏర్పాటు చేసినవేనన్నారు.

ప్రియాంకగాంధీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 హామీలు అమలు ఇస్తామన్నారు. మేము ఇక్కడ మాతో పాటు మీరు కూడా గర్వపడే రీతిలో నిజాయితీగా, కష్టపడి పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని, మీకు ఉద్యోగ, ఉపాధి, ఇండ్లు రాలేదన్నారు. మహిళల సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులను మంత్రులను చేశారని, పెద్ద పెద్ద రాజభవనాలు కట్టారని, కానీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఫామ్ హౌస్ నుంచి నడుస్తున్న మొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించి శాశ్వతంగా ఫామ్‌హౌజ్‌కు పంపించాలని కోరారు.