Revanth Reddy | వికారాబాద్‌ను ఎడారిగా మార్చిన కేసీఆర్ : రేవంత్ రెడ్డి
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువస్తే, వికారాబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు రద్దు చేసి కేసీఆర్ ఎడారిగా మార్చాడని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

విధాత : వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువస్తే, వికారాబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు రద్దు చేసి కేసీఆర్ ఎడారిగా మార్చాడని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు రాలేదన్నారు. పాలమూరు రంగారెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డికి బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేని అన్నారు. కందులకు సరైన మద్దతు ధర రాకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనన్నారు. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. బీఆరెస్, బీజేపీ వల్ల వికారాబాద్ శాటీ లైైట్ సిటీ ఆగిపోయిందన్నారు. మురికి కూపంలా తయారైన మూసీ బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
రంజిత్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వండి
వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని రేవంత్ అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి, స్పీకర్ పదవి దక్కిందని తెలిపారు. చేవెళ్ల ప్రజలు ఆలోచించి రంజిత్ రెడ్డి ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్ ముక్కు నేలకు రాయి
రైతు బంధు నిధులు ఇస్తే కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశాను…రైతు బంధు నిధులు 7 వ తేదీన వేశాను… కేసీఆర్ నీకు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయి అని రేవంత్ అన్నారు. అనంతగిరి కొండల్లో పద్మనాభుని సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. రైతు రుణం తీర్చుకోకపోతే ఈ ముఖ్యమంత్రి పదవి నిష్ప్రయోజనమన్నారు. రైతు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదేనన్నారు. సంక్రాంతి పండుగ కు గంగిరెద్దులా మోదీ, అమిత్ షా తెలంగాణ కు రోజూ వస్తున్నారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, మెట్రో రైలు ,ఐటీ కంపెనీలను రాష్ట్ర విభజన సమయంలో సోనియమ్మ రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఎల్లమ్మ,పోచమ్మ పండుగ లు మనం చేయలేదా అని అడిగారు. దేవుడి పేరు మీద విభజించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉన్న వారే అసలైన హిందువులన్నారు. దేవుడి పేరు మీద ఓట్ల భిక్షమెత్తుకునే వారు హిందూ ద్రోహి అని రేవంత్ ప్రకటించారు.