పోడు భూముల‌కు ప‌ట్టాలు.. అమ్ముకునే హ‌క్కు: రేవంత్ రెడ్డి

పోడు భూముల‌కు ప‌ట్టాలు.. అమ్ముకునే హ‌క్కు: రేవంత్ రెడ్డి
  • గిరిజ‌నేత‌రులకు ర‌క్ష‌ణ‌
  • ఉమ్మ‌డి ఆదిలాబాద్ ద‌త్త‌త‌
  • కేసీఆర్ ధన దాహానికి ప్రాణహిత చేవెళ్ల బలి
  • కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోపిడి
  • కోట్లు ఉన్నోళ్ల‌కు టికెట్లు ఇచ్చిన బీఆరెస్‌, బీజీపీ
  • ఓట‌ర్ల మ‌ద్ద‌తున్న వెడ‌మ బొజ్జ‌కు కాంగ్రెస్ టికెట్‌
  • మీరు 24 గంట‌ల క‌రెంటు ఇస్తే నామినేషన్లు వేయం
  • లేకుంటే ఇంద్ర‌వెల్లి అమ‌రుల స్థూపం వద్ద ముక్కు నేల‌కు రాస్తావా
  • ఖానాపూర్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేసీఆర్‌కు స‌వాల్ విసిరిన పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి


విధాత‌, హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇచ్చి అమ్ముకునే హ‌క్కు క‌ల్పిస్తామ‌ని ఆదివాసి గిరిజ‌నుల‌కు టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధ‌వారం అదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ గిరిజనేతరుల భూములకు రక్షణ కల్పిస్తామ‌న్నారు. వారికి రుణాలు ఇచ్చి ఆదుకుంటామ‌ని తెలిపారు.


లంబాడీలు, ఆదివాసీలు నాకు రెండు కళ్లలాంటి వారని, వారి మధ్య పంచాయితీ తెంచుతామ‌న్నారు. కాంగ్రెస్ లో కోట్లు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తారని బీఆరెస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు లేకపోయినా బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కనిపించడంలేదా అని అడిగారు. కోట్లు ఉన్నోళ్లకు బీజేపీ, బీఆరెస్ టికెట్లు ఇస్తే, ఓటర్ల మద్దతు ఉన్న వెడమ బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని చెప్పారు. వాళ్లు దొరలవైపు ఉంటే… బొజ్జు ప్రజల వైపు నిలబడ్డాడన్నారు.


మహారాష్ట్రను అడ్డుపెట్టుకుని కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ప్ర‌భుత్వం ల‌క్ష‌ కోట్లు దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ ధన దాహానికి ప్రాణహిత చేవెళ్ల బలైపోయిందన్నారు. కడెం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కడితే.. ఈ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ చూసుకోలేకపోతుంద‌న్నారు.


ఉమ్మ‌డి ఆదిలాబాద్ ద‌త్త‌త‌


దళిత, గిరిజనులపై కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఇంకెవరికి లేదని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పోడు పట్టాలు ఇచ్చిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం ధరణి తెచ్చి మీ భూములను గుంజుకుందని ఆరోపించారు. గిరిజనేతరులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు.


ఇంద్రవెళ్లి అమరుల కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత మాదన్నారు. సీఎం కేసీఆర్ అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. ధరణి రాకముందు రెండేళ్లు రైతు బంధు ఎలా ఇచ్చారని కేసీఆర్‌ను అడిగారు. వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదా? అని అన్నారు. కేసీఆర్‌ ధరణి తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టారన్నారు. అందుకే ధరణి స్థానంలో కొత్త మెరుగైన సాంకేతికత తీసుకోస్తామ‌ని తెలిపారు.


కేసీఆర్‌కు స‌వాల్ విసిరిన రేవంత్‌


కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని నిరూపిస్తే మేం నామినేషన్లు వేయం అని రేవంత్ ప్ర‌క‌టించారు. లేకపోతే ఇంద్రవెల్లి అమరుల స్థూపం సాక్షిగా ముక్కు నేలకు రాస్తారా? అని అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామ‌న్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు.. హనుమంతుడి గుడి లేని ఊరు లేదన్నారు. కేసీఆర్ ఖేల్ ఖతం.. దుఖాణ్ బంద్.. అని అన్నారు. కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలని ప్ర‌జ‌లు నిర్ణయం తీసుకున్నారన్నారు.


బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్లు రావు


కేసీఆర్ ను చూసి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు? అని రేవంత్ రెడ్డి అడిగారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని చెబుతున్న మోదీ… ముందు గుజరాత్ లో బీసీని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ముగ్గురు బీసీలను సీఎం చేసిందని తెలిపారు. కానీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క బీసీని సీఎం చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ కి 100 స్థానాల్లో డిపాజిట్లు రావని జోష్యం చెప్పారు. దొరల తెలంగాణ పోయి ప్రజా తెలంగాణ కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.