ఆ 42కోట్లు ఎవరివి?.. తెలంగాణ ఎన్నికల కోసమేనా..

- బీఆరెస్ కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్దం
విధాత : కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంబికాపతి ఇంట్లో, ఆయన సన్నిహితుల ఇండ్లలో ఐటీ దాడుల్లో మంచం కింద 23పెట్టెల్లో లభ్యమైన 42కోట్ల సొమ్ము ఎక్కడిది..ఎవరికి సంబంధించింది..ఎవరికి రవాణా అవుతుందన్నదానిపై తెలంగాణలో అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం సాగుతున్నది. పట్టుబడిన 42కోట్ల డబ్బులను కాంగ్రెస్ పార్టీ చెన్నై నుంచి తెలంగాణకు పంపించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిందని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్లు, వ్యాపారుల నుంచి 50శాతం కమిషన్లు వసూలు చేయించి 1500కోట్ల మేరకు తెలంగాణ ఎన్నికలకు తరలించి ఓటర్లకు పంచి గెలువాలని చూస్తుందని వారు ఆరోపించారు. తమ వాదనకు మద్ధతుగా డబ్బులు పట్టుబడిన కాంట్రాక్టర్ అంబికాపతి కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు, ఈశ్వరప్పలకు సన్నిహితుడని మంత్రులిద్దరు చెబుతున్నారు. బీఆరెస్‌ను ఓడించే ప్రయత్నాల్లో సహకరించే కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎవరైనా సరే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరికలు సైతం చేశారు.
అయితే కాంగ్రెస్ మాత్రం ఆ డబ్బులన్ని బీజేపీ తన మిత్ర పక్షం జేడీఎస్ ద్వారా తెలంగాణలో బీఆరెస్‌కు అందించేందుకు సిద్ధం చేసిందేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అంబికాపతి జేడీఎస్ మాజీ కార్పోరేటర్ భర్త అన్న విషయాన్ని వినిపిస్తోంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా బీఆరెస్ ఆరోపణలున్నాయంటూ విమర్శించింది. వాస్తవంగా అంబికాపతి గతంలో బీజేపీ ప్రభుత్వంపై కాంట్రాక్టర్ల నుంచి 40శాతం కమిషన్ వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అదే అంబికా పతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం 50శాతం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలకు కేంద్రంగా మారాడు.
అంబికాపతి సతీమణి అశ్వత్తమ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి అక్క. గతంలో కార్పొరేటర్. మరోవైపు బీజేపీ సైతం 42కోట్ల వివాదంలో స్పందిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సొమ్మును ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు చేసేందుకు తరలిస్తుందని ఆరోపిస్తుంది. దీంతో ఐటీ దాడుల్లో దొరికిన 42కోట్ల చుట్టునా బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పరస్పర ఆరోపణల పర్వం సాగుతుంది. ఈ నేపధ్యంలో అసలు కర్ణాటకలో పట్టుబడిన 42కోట్లు వాస్తవానికి ఎవరివి..ఎక్కడి నుంచి సమీకరించారు..ఎక్కడికి ఎవరి కోసం తరలిస్తున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.