మార్పు కోసం శ్యామ్‌జీని పార్టీలోకి తీసుకోండి: రాజాసింగ్

- హాట్ టాపిక్‌గా మారిన రాజాసింగ్ వ్యాఖ్యలు
విధాత : రాజకీయాలపైన, మత పర అంశాలపైన తనదైన శైలీలో ముక్కుసూటిగా మాట్లాడే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆలే శ్యామ్ జీని పార్టీలో తీసుకోవాలని రాజాసింగ్ సూచించారు.
దివంగత బీజేపీ నేత ఆలే నరేంద్ర సోదరుడు శ్యామ్ జీ రాకతో తెలంగాణ బీజేపీలో మార్పు వస్తుందన్నారు. హైద్రాబాద్ వాసిగా, టైగర్ నరేంద్ర సోదరుడిగానే కాకుండా జాతీయ స్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్‌గా సుదీర్ఘ సేవలందించిన శ్యామ్‌జీ రాక బీజేపీకి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
శ్యామ్‌జీని పార్టీలోకి తీసుకురావడానికి జాతీయ నాయకత్వంతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి సహా, రాష్ట్ర నేతలు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం శ్యామ్‌జీ ఆర్‌ఎస్‌ఎస్‌లో జాతీయ స్థాయిలో కీలక స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రాలలో విస్తృత పర్యటనలు చేస్తూ సంస్థ విస్తరణ, బలోపేత బాధ్యతలు చూస్తున్నారు.