Nalgonda | వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్, ఆయిల్ చోరి ముఠా అరెస్టు: ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని రైతుల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ కాయిల్స్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు

Nalgonda | వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్, ఆయిల్ చోరి ముఠా అరెస్టు: ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

ఐదుగురి నిందితుల రిమాండ్‌
వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్రపవార్‌

విధాత, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని రైతుల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ కాయిల్స్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. ఏపీ పిడుగురాళ్లకు చెందిన మెగవత్ రంగనాయక్, అతని కుటుంబానికే చెందిన సింగరాయపాలెంకు చెందిన జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలనా నాయక్‌, షేక్ జటావత్ వలీ నాయక్, చందంపేట యల్మలమందకు చెందిన కేతవత్ సునిల్ గత కొన్ని రోజులుగా రైతుల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల దోపిడి లక్ష్యంగా పెట్టుకున్నారు.

నల్గొండ జిల్లాలోని వాడపల్లి, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, త్రిపురారం, నిడమానూర్, తిప్పర్తి, నల్గొండ, నకిరేకల్, చిట్యాల పోలీస్ స్టేషన్ ల పరిదిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతుల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి అందులో గల కాపర్ కాయిల్స్‌ను, అయిల్ ను దొంగిలించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వారి కారులో హైదరాబాద్ లోని తమకు తెలిసిన మూడవత్ సుజాత, నరేశ్‌లకు చెందిన పాత ఇనుము వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముతు అక్రమంగా సొమ్ము చేసుకునేవారు. వారిని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, రూరల్ సీఐ కే. వీరబాబు, వాడపల్లి ఎస్‌ఐ రవి, టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ మహేందర్, సిబ్బంది నిఘా వేసి పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదారులు ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. వారిపై 34కేసులు నమోదై ఉన్నాయని, వారిని కోర్టుకు రిమాండ్ చేస్తున్నామని ఎస్పీ పేర్కోన్నారు.