వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. పోటాపోటీగా ఫిర్యాదులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పోలింగ్ సమీపిస్తున్న కొద్ధి పార్టీల పోటాపోటీ ప్రచారాల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు, ఫిర్యాదులతో హీటెక్కుతుంది

వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. పోటాపోటీగా ఫిర్యాదులు
  • వివేక్‌పై చెన్నూరు బీఆరెస్ అభ్యర్థి సుమన్ ఫిర్యాదు
  • కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్‌


విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పోలింగ్ సమీపిస్తున్న కొద్ధి పార్టీల పోటాపోటీ ప్రచారాల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు, ఫిర్యాదులతో హీటెక్కుతుంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపైన కత్తి దాడితో మొదలైన దాడులు, ఫిర్యాదుల పరంపర రోజురోజుకు ఉదృతమవుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల నుంచి 5వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. మిగిలిన 15రోజుల్లో మరిన్ని ఫిర్యాదులు అందవచ్చని భావిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రసంగాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.


అంతకుముందే పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ప్రసంగాలు కూడా రెచ్చగొట్టేదిగా ఉన్నాయంటూ బీఆరెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రకటనలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై పార్టీల పరస్పర ఫిర్యాదులను విచారించిన ఈసీ 14ఎన్నికల ప్రకటనల అనుమతులను రద్దు చేసింది. బీఆరెస్ ఎన్నికల ప్రచార ప్రకటనలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలు, దేవాలయాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.


ఇదే క్రమంలో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్ధి జి.వివేక్ పై బీఆరెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ తన కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని, ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని సుమన్ తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకుముందు నామినేషన్ల సందర్భంగాను వివేక్‌, సుమన్ వర్గాలు చెన్నూరులో గొడవ పడ్డాయి.


అటు ఇబ్రహీంపట్నం లో మంచికంటి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిల మధ్య గొడవపైన, గువ్వల బాలరాజుకు, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ, నల్లగొండలో బీఆరెస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య, సాగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డిపైన దాడి, కొస్గిలో పార్టీల ఘర్షణలపై సైతం పరస్పర ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి చేరాయి. ఇటు ఐటీ దాడులపైన కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఖమ్మం, పాలేరు అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలపై జరిగిన ఐటీ దాడులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. మధు యాష్కిగౌడ్ ఇంటిపైన జరిగిన పోలీసుల తనిఖీపై కూడా ఆయన ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.