Telangana | రైతును చుట్టుముట్టిన రాజకీయం.. నేతల తీరుతో రైతన్న ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రంలో రైతుల చుట్టూ రాజకీయం సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య రాజకీయ పార్టీలకు రైతన్నపై ప్రేమ పొంగిపొర్లుతోందీ.

బీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ
అన్నదాతపై నాయకుల అమితప్రేమ
రైతు భరోసా, రుణ మాఫీపై ఒత్తిడి
ధాన్యం కొనుగోళ్ళు, బోనస్ పై డిమాండ్
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం
బీజేపీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విమర్శలు
విపక్షాల పై సీఎం, మంత్రుల మండిపాటు
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రైతుల చుట్టూ రాజకీయం సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య రాజకీయ పార్టీలకు రైతన్నపై ప్రేమ పొంగిపొర్లుతోందీ. రైతాంగ సమస్యలే ప్రధాన ఏజెండగా రాజకీయ విమర్శలు సాగుతున్నాయి. బీఆరెస్, బీజేపీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి విమర్శలదాడి చేస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతాంగానికిచ్చిన హామీలే అస్త్రంగా విపక్షపార్టీలైన బీఆరెస్, బీజేపీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రైతాంగానికిచ్చిన హామీల పట్ల మీ ప్రభుత్వాలకు కనీస కట్టుబాటు లేదని మండిపడుతున్నారు.
దీనికి ప్రతిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు తమ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడం పట్ల చిత్తశుద్ధి ఉందంటున్నారు. తమ ప్రభుత్వ అంకితభావాన్ని ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి గత ఆరునెలలుగా రైతాంగం పై తమకే ప్రేమ ఉందంటూ మూడు పార్టీల నాయకులు తమకుతామే కితాబులిచ్చుకుంటున్నారు. దేశానికి వెన్నెముక రైతన్న అనే నినాదాన్ని నాయకులు నిత్యం స్మరిస్తున్నారు.
రైతు సమస్యలపై పార్టీల హామీ
రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారనేది బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో రైతులు ప్రధాన భూమికగా ఏ ప్రభుత్వమైనా వారి సంక్షేమం, అభివృద్ధి, సమస్యలను పరిష్కరించాల్సి ఉంటోంది. ఈ మేరకు ఎన్నికలొచ్చాయంటే రైతుల ఓట్లు ప్రధానంగా మారుతున్నాయి. ఈ కారణంగానే రైతుల సమస్యలు, పరిష్కారాలపై పార్టీలు వాగ్ధానాలు చేయడం పరిపాటిగా మారింది.
ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే అన్ని పార్టీలు, తమ మెనిఫెస్టోల్లో రైతాంగానికి అనేక వాగ్ధానాలిచ్చారు. ఇందులో కాంగ్రెస్, బీఆరెస్ పోటీపడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతాంగ సమస్యలను వాగ్ధానంగా ప్రకటించారు. తర్వాత తమ మెనిఫెస్టోలో రైతుభరోసా కింద రూ.15వేలు, రూ.2లక్ష-ల రుణమాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్, పంటల బీమాతో పాటు మరి కొన్ని వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి వాగ్ధానం చేశారు. బీఆరెస్ సైతం కాంగ్రెస్ హామీలకు అటుఇటూగా హామీలిచ్చింది. తాము తెచ్చిన రైతు బంధు, రుణమాఫీ అమలుతోపాటు ఇతరత్రా సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. బీజేపీ కూడా రైతాంగానికి మద్ధతు ధర ప్రకటిస్తామంటూ చెప్పింది. మూడు ప్రధాన పార్టీలు రైతులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డాయి.
ఎన్నికల్లో అన్నదాత ఎజెండా
అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల సమస్యలు, ధాన్యం దిగుబడి, నీటిపారుదల రంగం, కాళేశ్వరం ప్రాజెక్టు పై అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం సాగింది. తమ హయంలో రైతాంగ సమస్యలు తీర్చి బంగారు తెలంగాణగా మార్చామని, తెలంగాణ ధాన్యాగారమైందని బీఆరెస్ గొప్పగా చెప్పింది. ఎన్నికల ప్రచార సమయంలోనే కాలేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోయిన తర్వాత బీఆరెస్ నేత కేసిఆర్ మౌనం వహించగా కాంగ్రెస్ బీఆరెస్ పై విమర్శలెక్కుపెట్టింది. బీజేపీ కేంద్రంలో రైతులు సమస్యలు తీర్చకుండా మూడు నల్ల చట్టాలు తెచ్చారని, వందలాది మంది రైతుల ఉసురుతీసిందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
రైతు చుట్టూ రాజకీయం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ప్రారంభమైన రాజకీయ పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల పై కాంగ్రెస్, బీఆరెస్ పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ బీఆరెస్, బీజేపీ తీవ్రంగా ప్రచారం చేశాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు సైతం కాంగ్రెస్ తెచ్చిందంటూ విమర్శించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ పొలాలను సందర్శించారు. రైతు భరోసా అమలు చేయలేదని, రుణమాఫీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండోరోజే ధాన్యం కొనుగోళ్ళ పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీఆరెస్ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు వీలైన చోట్ల క్షేత్రస్థాయిలో ధాన్యం కల్లాలను పరిశీలన చేస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆరెస్, బీజేపీ, నాయకులు పోటీపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇదే సమస్యను రెండు పక్షాల నాయకులు ప్రచారం చేస్తున్నారు.
వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించగా సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం రెండు పార్టీల నాయకులు చేస్తున్నారు. బీఆరెస్, బీజేపీ నాయకులు తీరుపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. రైతాంగం పై తమ చిత్తశుద్ధిని అనుమానించకూడదంటున్నారు. ఇప్పటికే రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమచేసినట్లు ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు. వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి బోనస్ అందిస్తామని ప్రకటించారు. బీఆరెస్, బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్, ప్రభుత్వ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.
విపక్షాలది ఫక్తు రాజకీయం
తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో రైతు భరోసా అమలు చేశాం. రుణమాఫీ అమలుకు డెడ్లైన్ ప్రకటించారు. పంటల బీమా అమలుకు చర్యలు చేపట్టాం. ధాన్యం కొనుగోలు సాగుతున్నాయి. తడిసిన ధాన్యం, మొలక వచ్చిన ధాన్యాన్ని కూడా ఎం ఎస్ పి రేటుకు కొనుగోలు చేస్తామని ప్రకటించాం అయినా విపక్షాలు విమర్శించడంలో చిత్తశుద్ధి లేదని మంత్రి సీతక్క విమర్శిస్తున్నారు. ఇదేమి పట్టించుకోకుండా రైతులను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా తామే రైతుల పక్షపాతిమంటూ చెప్పుకునేందుకు ఎవరికివారు మూడు పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రైతుల చుట్టూ రాష్ట్రంలో రాజకీయం రంజుగా సాగుతోంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నందున ఈ అంశం మరింత చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.