అమల్లోకి ఎన్నికల కోడ్.. అధికార పార్టీ దూకుడుకు బ్రేక్!

- అనారోగ్యంతో వీలుకాని సీఎం కేసీఆర్ కేబినెట్ చివరి భేటీ
- షెడ్యూల్ వచ్చినా.. ఖరారు కాని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా
- తేలని పొత్తులు.. విలీనన తంతులు
విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చేసింది. దీంతో అధికార బీఆరెస్ ప్రభుత్వం ఇక మీదట ఆపద్దర్మ ప్రభుత్వంగా కొనసాగనుండగా, కొత్త సంక్షేమ పథకాల ప్రకటనకు, నిధుల విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలకమైన విధాన పర నిర్ణయాలు, కొత్త పథకాలను ప్రకటించాలని భావించారు. ఆయన అనారోగ్యం బారిన పడటంతో కేబినెట్ భేటీకి అవకాశం లేకుండా పోయింది.
అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గృహలక్ష్మి, బీసీ బంధు, మైనార్టీ బంధు, చేనేతకు చేయూత, ఎంఫ్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టు, పీఆర్సీ, ఐఆర్, ముఖ్యమంత్రి అల్పాహార పథకం వంటి వాటిని అమల్లోకి తెచ్చారు. దాదాపుగా వాటికి సంబంధించి సింహభాగం లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. అయితే ఎన్నికల కోడ్ అమలు నేపధ్యంలో ఆ పథకాల అమలు జరుగుతుందా లేక నిలిపివేస్తారా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. అలాగే రైతు బంధు పథకం కూడా ఈ ఏడాది రెండో విడత సహాయం సంబంధించి పోలింగ్‌కు దగ్గరలో నవంబర్-డిసెంబర్ మొదటి వారంలోనే కొనసాగనుంది.
ఎన్నికల కోడ్ గతంలో మాదిరిగా దీనికి వర్తించకపోవచ్చంటున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఎన్నికల కమిషన్ల స్పందన ఏ విధంగా ఉంటుందన్నదానిపైనే రైతుబంధు సహాయ పంపిణీ ఆధారపడింది. ఎన్నికల కోడ్ నేపధ్యంలో తాము కొత్తగా చేయదలచిన పథకాలు అమలులోకి తేలేకపోయినప్పటికి ఎన్నికన మ్యానిఫెస్టో ద్వారా ప్రచార పర్వంలో వాటిని బీఆరెస్ పార్టీ ప్రజలకు వివరించనుంది. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఆగిన పథకాలను, కొత్త పథకాలను అమలు చేస్తామని ప్రజలకు చెప్పుకోనుంది.
ఖరారుకాని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికి అధికార బీఆరెస్ పార్టీతో ఎన్నికల్లో ప్రధానంగా తలపడే కాంగ్రెస్, బీజేపీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆ పార్టీ కేడర్‌లో కొంత అసహానాన్ని రగిలిస్తుంది. బీఆరెస్ పార్టీ ఆగస్టు 21వ తేదీన ఒకేసారి 115స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. మల్కాజిగిరితో పాటు మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌లో మాత్రం టికెట్ల కోసం దరఖాస్తు తీసుకుని నెల దాటిపోయినా ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగిస్తుండటంతో కేడర్‌ను గందరగోళంకు గురి చేస్తుంది. బీజేపీ సైతం 14వ తేదీకల్లా తొలి జాబితా వెల్లడిస్తామంటుంది. ఈ నేపధ్యంలో ఆ రెండు పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో షెడ్యూల్ కంటే వెనుకబడిపోయినట్లయ్యింది.
పొత్తులలో తొలగని అయోమయం
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఎంలు పొత్తులు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న ఇంతవరకు కాంగ్రెస్ నుంచి దీనిపై స్పష్టత రాలేదు. వామపక్షాలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉందని, పొత్తుల చర్చలు రెండు పార్టీల కేంద్ర నాయకత్వం చూస్తున్నాయని కాంగ్రెస్, లెఫ్ట్ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా కూడా వారి మధ్య పొత్తుల చర్చలు కొలిక్కిరాకపోవడం విచారకరమే.
ఆదరాబాదరగా చివరి నిమిషంలో సీట్ల సర్ధుబాట్లతో ఆ పార్టీల మధ్య పరస్పర ఓట్ల బదలాయింపు ఎంతమేరకు సాధ్యపడుతుందో పోలింగ్‌లోనే తేలాల్సివుంది. అసలు కాంగ్రెస్-లెఫ్ట్ పొత్తు ఉంటుందో లేదోనన్న అయోమయం సైతం కొనసాగుతున్నది. అటు వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన కూడా గందరగోళంలో పడటంతో వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. దీంతో విలీనం తేలకపోతే తమ పార్టీ ఒంటరీగానే ఎన్నికలకు వెలుతుందని, తాను పాలేరులోనే పోటీ చేయబోతున్నానని షర్మిల చెబుతోంది.
బీఎస్పీ 20మందితో తొలి జాబితా ప్రకటించగా, టీజేఎస్, తెలంగాణ టీడీపీ, తెలంగాణ జనసేనలు కూడా ఇంకా తమ అభ్యర్థుల ప్రకటన చేయలేదు. పోలింగ్‌కు కేవలం 50రోజుల సమయమే ఉన్న నేపధ్యంలో అధికార బీఆరెస్ పార్టీ ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకుండా, పొత్తులు, సీట్ల సర్ధుబాటు చేసుకోకుండా కాలాయపన చేస్తున్న నేపధ్యంలో తెలంగాణ రాజకీయాలు.. ఎన్నికల ప్రచార ఘట్టం మునుముందు ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.