అవినీతి రహిత పారదర్శక పాలనే లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేసి పారదర్శకమైన అవినీతి రహిత పాలన సాగేలా చూస్తామని ఇరిగేషన్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు

అవినీతి రహిత పారదర్శక పాలనే లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

విధాత : రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేసి పారదర్శకమైన అవినీతి రహిత పాలన సాగేలా చూస్తామని ఇరిగేషన్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మేళ్లచెర్వు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేసి రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రకియ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ పదేళ్లలో ఆరు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. బీఆరెస్‌ పాలకులే తప్ప ప్రజలు బాగుపడిందేమి లేదని ప్రజలపై ఒక్కోక్కరి నెత్తి మీద 2లక్షల అప్పులు మోపారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 93వేల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు చేసి, కట్టిన మూడేళ్లకు పనికిరాకుండా పోతుందన్నారు.



 


పై నుంచి కింద వరకు అవినీతి కక్కూర్తితో ప్రాజెక్టులను, వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. 24గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకుండానే ఇచ్చిందని ప్రజలను, రైతులను మభ్యపెట్టిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 13-14స్థానాల్లో గెలుస్తామని, నల్లగొండ పార్లమెంట్‌ స్థానాన్ని 3లక్షల మెజార్టీతో గెలుస్తామన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్ని అమలు చేస్తామన్నారు. రామ మందిరం పూర్తి కాకముందే ప్రారంభోత్సవాన్ని..ప్రాణప్రతిష్టాపనోత్సవాన్ని పలువురు శంకరాచార్యుల వంటి పీఠాధిపతులు, గురువులు తప్పుబట్టారన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈవెంట్‌గా రామాలయ ప్రారంభోత్సవాన్ని ప్రారంభింభిస్తుందన్నారు. మేం రామభక్తులమేనని, ప్రతి రోజు పూజ చేస్తామని, అయోధ్య గుడి పూర్తయ్యక మేం కూడా వెళ్లి దర్శించుకుంటున్నామన్నారు. గత ఎమ్మెల్యే హుజూర్‌నగర్‌లో లంచాలు తీసుకోవడం మినహా ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించలేదన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల శాఖ మంత్రితో మాట్లాడి ఇండిస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు.