దళిత యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

విధాత: ఇంటి పనిమనిషిగా చేరిన దళిత యువతిపై లైంగిక దాడి, దాడి, బెదిరింపులకు పాల్పడిన బంజారాహిల్స్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీ ముకుంద్, కుమారుడు ఆకాశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురు వయసున్న బాధిత యువతి ఏజెన్సీ ద్వారా ముకుంద్ ఇంటిలో పనిమనిషిగా చేరింది. ఆమెపై ముకుంద్ లైంగిక దాడికి పాల్పడగా, సమస్యను అతని కొడుకు ఆకాశ్‌కు యువతి వివరించింది. అతను కూడా ఆమెనే కొట్టి బెదిరించి తండ్రికి మద్దతుగా నిలిచాడు.
గత జూలైలో జరిగిన ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు నిందితులు తామే ముందుగా పోలీసు స్టేషన్‌లో యువతిపై ఫిర్యాదు చేసి సెటిల్ మెంట్ చేసుకున్నారు. అయితే యువతి మానసిక స్థితిని గమనించిన తల్లి ఆమెను అన్ని వివరాలు అడిగి తెలుసుకుని బంజరాహీల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు యువతిని భరోసా సెంటర్‌కు పంపించి కౌన్సిలింగ్ ద్వారా పూర్తి వివరాలు రాబట్టారు.
కాగా.. నిందితులు మురళీ ముకుంద్, ఆకాశ్‌లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు లైంగిక దాడి, దాడి, నగ్నచిత్రాల పేరుతో బెదిరించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తల్లి ఫిర్యాదుతో పాటు విచారణ నివేదికను, భరోసా సెంటర్ నివేదికను పోలీసులు సీల్డ్ కవర్‌లో ఉన్నతాధికారులకు పంపించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.