జనగామ గులాబీ కథ సుఖాంతం

- ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి బాధ్యతలు
- పల్లా రాజేశ్వర్ రెడ్డికి లైన్ క్లియర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చాలాకాలంగా పీఠముడి పడిన జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక కథ సుఖాంతమైట్లే. సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రాష్ట్ర ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక సులువైంది. జనగామపై కన్నేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీ అధినేత కేసీఆర్ పల్లా వైపే మొగ్గు చూపుతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
115 మంది అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, జనగామ అభ్యర్థి ఎంపికను పెండింగ్లో పెట్టారు. ఈ స్థానాన్ని ముత్తిరెడ్డికి కాదని పల్లా వైపు మొగ్గు చూపుతున్నారని వార్తల నేపథ్యంలో ముత్తిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ గా రెండు రోజుల క్రితం నియమించారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చినట్లేనని భావించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ముత్తిరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించడంతో జనగామ టికెట్ వ్యవహారం తేలిపోయింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ పల్లాకే చాన్స్ దక్కనున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే జనగామపై పట్టు బిగించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి పలు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజా పరిణామాలతో ఇక ఆయన ముత్తిరెడ్డి తోడుగా జనగామలో అధికారికంగా ఎంటర్ కానున్నారు.
బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్‌లోని తన చాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జన్నార్, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి, సన్మానించారు.