బీఆరెస్ గూటికి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు

బీఆరెస్ గూటికి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు
  • నల్గొండ కాంగ్రెస్ కు భారీ షాక్


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గంలో సీనియర్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ బీఆరెస్ గూటికి చేరారు. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బుధవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.


కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న తండు సైదులు ఎట్టకేలకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో తన అనుచరులతో బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో మరోసారి అభివృద్ధి సాగాలంటే కచ్చితంగా కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించడంతోపాటు సీనియర్లకు పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.


తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకాలు అధికమయ్యాయని, ఇద్దరు ముగ్గురు నాయకుల మాయలో కోమటిరెడ్డి రెడ్డి ఉన్నారని ధ్వజమెత్తారు. మరింత మంది కౌన్సిలర్లతో పాటు తిప్పర్తి మండల నాయకులు, బీసీ నాయకులు అంతా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో నల్గొండ మండల వైస్ ఎంపీపీ పరమేష్, మాజీ జడ్పీటీసీలు, నాయకులు ఉన్నారు.