జగ్గన్నను 50 వేల మెజార్టీతో గెలిపించండి: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

జగ్గన్నను 50 వేల మెజార్టీతో గెలిపించండి: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

– రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనది కీలకపాత్ర

– బద్ధశత్రువులను కలిపిన కాంగ్రెస్ విజయ భేరి సభ

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించండి… రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనది కీలకపాత్ర అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో కాంగ్రెస్ విజయ భేరి సభ జరిగింది. ఈ సందర్భంగా వేదికపై నుంచి ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి… జగ్గారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో ఒకరినొకరు కౌగలించుకొని, చేతులు పైకెత్తి కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. జగ్గారెడ్డి సైతం తన ప్రసంగంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని అన్నారు. ఇలా ఒకరినొకరు పొగుడుకోవడంతో సభలో నవ్వులు పూసాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా ఉప్పూనిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డిలను సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభ కలిపినట్లయ్యింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఠాక్రే, ఇతర ముఖ్య నాయకుల సాక్షిగా వారిద్దరూ ఒక్కటయ్యారు.