Traffic Restrictions | లాల్ దర్వాజా బోనాలు.. పాతబస్తీలో 28, 29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
గతవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగగా, ఈ ఆదివారం పాతబస్తీలోని సింహ వాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర కొనసాగనుంది. ఈ బోనాల జాతరకు లాల్ దర్వాజా ముస్తాబైంది.

హైదరాబాద్ : గతవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగగా, ఈ ఆదివారం పాతబస్తీలోని సింహ వాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర కొనసాగనుంది. ఈ బోనాల జాతరకు లాల్ దర్వాజా ముస్తాబైంది. పాతబస్తీలో బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
జులై 28న లాల్ దర్వాజాలో, జులై 29న అక్కన్న మాదన్న టెంపుల్ నుంచి నయాపూల్ వరకు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో హిమ్మత్‌పుర నుంచి షంషీర్‌గంజ్ వైపు వెళ్లే వాహనాలను గౌలిపురా, సుధా టాకీస్ మీదుగా మళ్లించనున్నారు. చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ వైపు నుంచి సిటీలోకి వచ్చే వాహనాలను గౌలిపురా లేదా నాగుల్‌చింత మీదుగా మళ్లించనున్నారు. మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్(ఆరాంఘర్) నుంచి వచ్చే వాహనాలను జహనుమా, గోశాల, తాడ్‌బన్, ఖిలావత్ మీదుగా మళ్లించనున్నారు.
ఇంజిన్ బౌలి నుంచి వచ్చే వాహనాలను షంషీర్‌గంజ్ వద్ద, చార్మినార్ నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి వద్ద, చాదర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలను పురానా హవేలీ రోడ్, శివాజీ బ్రిడ్జ్ వద్ద మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మీర్ చౌక్, మొఘల్‌పురా నుంచి వచ్చే వాహనాలను మీర్ కా డయారా వైపు, ఖిలావత్ ప్లే గ్రౌండ్ వద్ద ఫతే దర్వాజా మీదుగా మళ్లించనున్నారు.
ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బోనాల జాతరకు వచ్చే భక్తులు ఈ కింది ప్రదేశాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు.
పార్కింగ్ ప్రదేశాలు ఇవే..
-దేవి ప్లేవుడ్, శాలిబండ
-అల్కా థియేటర్ ఓపెన్ ప్లేస్, నాగులచింత
-ఆర్య వైశ్య మందిర్, అపోజిట్ సుధా థియేటర్ లేన్
-వీడీపీ స్కూల్ గ్రౌండ్
-చార్మినార్ బస్ టెర్మినల్
-ఢిల్లీ గేట్