పాలమూరు బీజేపీలో మూడు ముక్కలాట
పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీకి బీజేపీ అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది

– ఎంపీ టికెట్ కోసం ముగ్గురి మధ్య పోటీ
– సై అంటున్న డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్
– పైకి మాత్రం.. టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే!
– లోలోన అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నం వారిదే..
– అయోమయంలో కమల దళం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీకి బీజేపీ అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. పైమాటలకు మాత్రం.. టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ అధిష్టానం ప్రకారం పనిచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కానీ టికెట్ దక్కించుకునేందుకు అధిష్టానం వద్ద లోలోన తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ముందునుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పోటీలో ఉంటారని అందరూ అనుకొన్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పోటీలో ఉండేందుకు పావులు కదుపుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పాలమూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 20 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. కుమారుడు ఓటమి చెందినా ఓట్లు బాగానే వచ్చాయనే ఆనందంలో బీజేపీ క్యాడర్ ఉందని, వారంతా తాను ఎంపీగా పోటీలో ఉండాలని కోరుకుంటున్నారని జితేందర్ రెడ్డి అంటున్నారు. ప్రధాని మోడీతో మంచి రాజకీయ సంబంధాలు ఉండడంతో ఆయనకు ఎంపీ టికెట్ ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. పాలమూరు నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఎంపీగా జితేందర్ రెడ్డి పనిచేసిన అనుభవం ఉంది. ఈనేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గుచూపుతుందా? లేదా? అనే సంశయం క్యాడర్ లో ఉంది. ఆయన పాలమూరులోనే ఉంటూ ప్రతిరోజు జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ కార్యక్రమాలకు హాజరవుతూ, క్యాడర్ ను దగ్గర చేసుకుంటున్నారు. ఈ మధ్య రెగ్యులర్ గా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన అభిప్రాయం వెల్లడిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని ప్రకటిస్తున్నారు. టికెట్ ఎవరికి వచ్చినా తన మద్దతు వారికే ఉంటుందని జితేందర్ రెడ్డి అంటున్నారు. టికెట్ ముఖ్యం కాదని, పార్టీ గెలుపు ముఖ్యమనే సిద్ధాంతం కలిగిన వ్యక్తిని అని ప్రతి సమావేశం లో ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఆయన పనిచేస్తున్నారు.
పావులుకదుపుతున్న డీకే అరుణ
పాలమూరులో బీజేపీ మరో నేత డీకే అరుణ కూడా పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పాలమూరు ఎంపీ నియోజకవర్గంలో పరిధిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసమే అసెంబ్లీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉండి, పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గద్వాల నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయాలని అహ్వానం వచ్చినా ఆమె తిరస్కరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె విముఖత చూపడం కూడా ఎంపీ స్థానం కోసమే అని తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి పోటీలో ఉండి విజయం సాధిస్తాననే నమ్మకంతో ఆమె ఉన్నారు. కానీ ఇంతవరకు ఆమె అభిప్రాయం వెల్లడించలేదు. ఇంకా సమయం ఉందనే ఉదేశంతో ఈ ఎంపీ స్థానంపై ప్రకటన చేయడం లేదు. కానీ టికెట్ ఆమెకే వస్తుందని ఇక్కడి బీజేపీ క్యాడర్ అనుకుంటోంది.
తనకే టికెట్ ఇవ్వాలంటున్న శాంతికుమార్
పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత శాంతి కుమార్ ప్రయత్నం ప్రారంభించారు. పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నానని, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ తనకే ఇవ్వాలని భాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేయలేదని, ఈసారి అవకాశం తనకే ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇన్నేళ్ళు పార్టీకి సేవ చేసినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ తనను గుర్తించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముగ్గురు ప్రధాన బీజేపీ నేతలు పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు
పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాలమూరు, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాలు ఉన్నా, వీటిలో ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసినా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోడీని నమ్మి బీజేపీకి ఓటు వేస్తారని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని అభిమానించే వారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఆ పార్టీ క్యాడర్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ కు ఓట్లు రావని, కాంగ్రెస్ ను అభిమానించే వారు కూడా కేంద్రంలో మోడీ సర్కార్ ఉండాలని బీజేపీకి ఓటు వేసేందుకు ఆలోచన చేస్తారనే ఉద్దేశంలో బీజేపీ నేతలు ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో పాలమూరు పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపు తథ్యమనే ధోరణిలో నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈస్థానం నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ క్యాడర్ మాత్రం టికెట్ ఎవరికి వస్తుందో అనే సంశయంలో ఉంది.