టీఎస్‌పీఎస్సీకి జనార్దన్‌రెడ్డి రాజీనామా

విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ పదవికి బీ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు సోమవారం పంపించారు. రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పంపించారు.
బీఆరెస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సుమారు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నదన్న అపవాదును మూటగట్టుకున్నది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రతి పరీక్షపై అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ చైర్మన్, సభ్యులకు తమంతట తాముగా రాజీనామాలు సమర్పించాలని సమాచారం పంపిందని తెలుస్తున్నది. రాజ్యాంగబద్ధ పదవులు కావడంతో వాటిలో ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు సోమవారం కమిషన్ చైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. కమిషన్ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.