కవిత నెంబర్‌ వస్తుంది.. జైలుకెళ్లక తప్పదు: కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

కవిత నెంబర్‌ వస్తుంది.. జైలుకెళ్లక తప్పదు: కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

విధాత : తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఉద్యమనేతగా ప్రజలకు మేలు చేస్తారనుకుంటే నిరుద్యోగులతో పాటు అందరినీ మోసం చేశారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీకి హాజరైన ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయస్థాయి వార్తల్లో నిలిచిందని ఎద్దేవా చేశారు.


తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడని విమర్శించారు. తప్పు చేసిన వారు ఎవరు తప్పించుకోలేరని ప్రతి ఒక్కరి నెంబర్ వస్తుందని, అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందనని ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అని విమర్శించారు.


ఛత్తీస్ ఘడ్‌, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రజాధనం లూటీ చేసిందన్నారు. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు కొద్ది నగదు, కిలోల కొద్ది బంగారం దొరికిందని గుర్తు చేశారు. విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మహదేవ్ యాప్‌ పేరిట కాంగ్రెస్ భారీ కుంభకోణం చేసి దేవుడి పేరుని చెడగొట్టిందన్నారు.


మహదేవ్ యాప్ పేరిట 58 కోట్లు ఛత్తీస్ ఘడ్‌ సీఎం ముఖేష్ భగేల్ కు అందాయని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఎన్నికల్లో పనిచేయడం లేదని, అబద్ధపు కాంగ్రెస్ అబద్ధపు గ్యారెంటీలు అనుకుని ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారన్నారు.


బుల్లెట్‌పై వచ్చి నామినేషన్‌ వేసిన రాజాసింగ్‌


గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం బుల్లెట్‌పై వచ్చి తన నామినేషన్‌ దాఖలు చేశారు. ర్యాలీలతో హంగామా లేకుండా అబిడ్స్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బుల్లెట్‌ పై వచ్చిన రాజాసింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.


రాజాసింగ్‌ వెంట వచ్చిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నలుగురితో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. రాజాసింగ్‌ నామినేషన్‌ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హాజరయ్యారు. నామినేషన్‌కు ముందు ధూల్‌పేట్‌లోని ఆకాశపురి ఆలయంలో రాజాసింగ్‌ పూజలు నిర్వహించారు.