బీఆరెస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లే: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు

విధాత : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదివారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీఆరెస్ నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో లేని.. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో రాని బీఆరెస్‌కు ఓటు వేసి ఏం లాభం లేదని వెల్లడించారు. బీఆరెస్ ఎంపీలు గెలిచినా ఓడినా రాష్ట్రానికి వచ్చే నష్టమేది లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రజలు అధికారం ఇచ్చినా బీఆరెస్ రాష్ట్రాభివృద్ధికి ఏమి చేయలేకపోగా, కేంద్రం ఇచ్చిన ఇండ్లను సైతం నిర్మించి పేదలకు అందించలేకపోయిందని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని, 1500పనికిరాని చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. బీఆరెస్ పదేళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. అప్పులు..అవినీతి మయంగా బీఆరెస్ పాలన సాగిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ముందు విద్యుత్ కోతలు, ఎరువుల కొరతలు ఉండేవని ఇప్పుడా సమస్య లేదన్నారు. ప్రధాని మోదీ వల్ల రూపాయికే కిలో బియ్యం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు వచ్చాయని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు. జాతీయ రహదారుల విస్తరణ జరిగిందని తెలిపారు. బీఆరెస్ హయాంలో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని గుర్తుచేశారు. అంతేకాదు ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన గ్యారంటీలను ఎలా అమలు చేయాలో కనీసం రూట్ మ్యాప్ కూడా లేదన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి 350కి పైగా లోక్ సభ సీట్లను తమ పార్టీ గెలుస్తోందని విశ్వాసంతో ఉన్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ది బీజేపీకి శ్రీరామ రక్షగా నిలువనుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని, 10 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి గిప్ట్‌గా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.