తేలని చర్చలు,కేబినెట్ విస్తరణ,పీసీసీ నూతన సారధి వీడని సస్పెన్స్‌ .. ఖర్గే నివాసంలో కీలక చర్చలు

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ..పీసీసీ నూతన సారధి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యనేతల చర్చలలో బుధవారం కూడా కొలిక్కి రాలేదు

తేలని చర్చలు,కేబినెట్ విస్తరణ,పీసీసీ నూతన సారధి వీడని సస్పెన్స్‌ .. ఖర్గే నివాసంలో కీలక చర్చలు

విధాత, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. పీసీసీ నూతన సారథి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య నేతల చర్చలు బుధవారం కూడా కొలిక్కి రాలేదు. కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బీ మహేశ్‌కుమార్ గౌడ్‌, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ చర్చలు జరిపారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఎంపికకు సంబంధించి కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ పదవిని బీసీ నేతకే అప్పగించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చిందని సమాచారం. పీసీసీ చీఫ్ రేసులో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కిగౌడ్‌ ఉన్నారని, వారి మధ్య ఏకాభిప్రాయ సాధనకు అవసరమైన చర్చలు పూర్తి చేశారని తెలుస్తున్నది. ఏ రోజైనా పీసీసీ చీఫ్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చంటున్నారు.చేరికలపైనా చర్చలుబీఆరెస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానం పెద్దలతో చర్చించారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. చేరికల పర్వాన్ని కొనసాగించేందుకు అధిష్ఠానం సానుకూలత తెలిపిందని ఆ వర్గాల కథనం.

తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరింత కసరత్తు

తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరింత కసరత్తు జరుగాల్సివుందని భావిస్తున్న అధిష్ఠానం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డితో జరిపిన చర్చల్లో ఈ మేరకు సూచనలు చేసిందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది బహుశా మరికొన్ని రోజులు కేబినెట్ విస్తరణ వాయిదా పడే అవకాశముందంటున్నారు. సామాజిక సమీకరణలు, జిల్లాల సమతుల్యత, లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం విస్తరణలో ఆశావహులకు అవకాశం కల్పించే దిశగా కసరత్తు సాగిందని తెలుస్తున్నది. మంత్రివర్గంలో స్థానం కోసం ఎక్కువ మంది పోటీపడుతున్న నేపథ్యంలో అధిష్టానం మరింత కసరత్తు చేస్తున్నదని, అందుకే విస్తరణ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచినవారికే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచనలమేరకేనని సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రిని కలుపుకొని మొత్తం కేబినెట్‌ 12 మంది మంత్రులుగా ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉన్నా.. బెర్తును ఆశించేవారి జాబితా పెద్దగానే కనిపిస్తున్నది. ఆరుగురిలో నలుగురిపై క్లారిటీ వచ్చిందని చెబుతున్నా.. కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టంగా చెప్పలేక పోతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి రెండు కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో బోధన్‌ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి పేర్లకు చర్చకు వస్తున్నాయి. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బెర్త్‌ ఖరారైందని అంటున్నారు. భువనగిరి ఎంపీ టికెట్‌ తమ కుటుంబసభ్యుల కోసం చివరి వరకు ప్రయత్నించిన ఆయనకు హైకమాండ్‌ అప్పుడే హామీ ఇచ్చిందని పలువురు గుర్తు చేస్తున్నారు. మిగిలినవారిలో జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి మధ్యే పోటీ ఉన్నదని చెబుతున్నారు.