కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్‌గా విజయశాంతి
మాజీ ఎంపీ విజయశాంతి నిన్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

విధాత: మాజీ ఎంపీ విజయశాంతి నిన్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు కట్టబెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ నియమించింది.
కాగా.. 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయగా, కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ బాధ్యతలను తాగాజా పార్టీలో చేరిన విజయశాంతికి అప్పగించింది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండ రెడ్డి, నరేందర్ రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వర్ రావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేశ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌ను నియమించారు.
మెదక్ ఎంపీ టికెట్ హామీతో ఆమె కాంగ్రెస్‌లో చేరినట్లుగా తెలుస్తుంది. కామారెడ్డి టికెట్ బీజేపీ అధిష్టానం ఇవ్వకపోవడం, స్టార్ క్యాంపయినర్ జాబితా నుంచి తొలగించి చేర్చడం, పార్టీలోని అంతర్గత పరిణామాలతో అసంతృప్తికి గురైన విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.
1998లో విజయశాంతి రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచి మొదలైంది. 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన విజయశాంతి 2009 బీఆరెస్ లో ఆ పార్టీని విలీనం చేశారు. 2014 లో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి తిరిగి 2020లో మళ్ళీ బీజేపీలో చేరారు. 2009లో బీఆరెస్ నుంచి మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన విజయశాంతి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.