శ్రీహరికి రాజయ్య సహకరించేనా?

శ్రీహరికి రాజయ్య సహకరించేనా?
  • టికెట్‌పై ఆశతోనే ఉన్నానన్న వ్యాఖ్యల వెనుక?
  • మళ్లీ రాజుకోనున్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ వివాదం!


విధాత : ఒకవైపు రైతుబంధు సమితి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే.. మరోవైపు బీఆరెస్‌ టికెట్‌పై ఇప్పటికీ ఆశాభావంతోనే ఉన్నానని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజాభిమానం తనకే ఉన్నదని, సర్వేలు, ఇతర నివేదికల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పార్టీ అధిష్ఠానం తన నిర్ణయం మార్చుకుంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమస్య సమసిపోయిందని అనుకున్నా.. మళ్లీ టికెట్‌ గురించి రాజయ్య మాట్లాడటం గమనార్హం.


రాజయ్య వ్యాఖ్యలు చూస్తే ఆయన శ్రీహరికి సహకరించే పరిస్థితి ఉన్నట్టు కనిపించడం లేదని నియోజకవర్గంలో అప్పుడే చర్చ మొదలైంది. రాజయ్య ఆంతర్యం ఏమిటో అంతుబట్టడం లేదంటున్నారు. రాజయ్య, శ్రీహరి మధ్య 2011 నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్నది. సుదీర్ఘ కాలం స్టేషన్‌ ఘన్‌ఫూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజయ్య తన స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరన్నది ఆయన మాటల ద్వారా అర్థమౌతున్నదని పరిశీలకులు అంటున్నారు.


ఉప్పు నిప్పులా శ్రీహరి-రాజయ్య వర్గాలు


రాజయ్య 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2011లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో కడియం శ్రీహరిపై ఆయన గెలిచారు. 2014, 2018లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆయనకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు.


ఆ తర్వాత రాజయ్యపై వచ్చిన ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. నాటి నుంచి రాజయ్య, శ్రీహరి వర్గాలు ఉప్పు నిప్పులా మారాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలతోనే ఆయనకు అధిష్ఠానం టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించిందనే వాదనలు ఉన్నాయి.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించారు. ప్రకటనకు ముందు నుంచే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. టికెట్‌ ప్రకటన తర్వాత ఆ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకునే దాకా పరిస్థితులు వెళ్లాయి. బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచీ పట్టున్న జిల్లాల్లో వరంగల్‌ ఒకటి.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, మహబూబాబాద్‌ టికెట్ల విషయంలో అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రాజయ్యను బుజ్జగించడానికి మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు. రాజయ్య ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా పార్టీ పెద్దలతో సమావేశమై తన వాదనలు వినిపించారు. దీంతో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్‌.. రాజయ్యను రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమించారు.


చైర్మన్‌గిరీపై అయిష్టత?


సిట్టింగ్‌ స్థానం కోల్పోయిన రాజయ్య అధిష్ఠానం ఇచ్చిన పదవి పట్ల సంతృప్తికరంగా లేరని ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. కేసీఆర్‌ తనకు ఎమ్మెల్సీగానో, ఎంపీగానో అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ ఆ వాతావరణం ఏమీ కనిపించడం లేదు. దీనికితోడు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, వివిధ సర్వేల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మెజారిటీ సీట్ల తేడా కొద్దిగానే ఉండటం వంటివి రాజయ్యను ఆలోచనలో పడేసి ఉంటాయని అంటున్నారు.


ఒకవేళ బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రాకపోతే ఈ పదవీ మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోతుందని, తద్వారా తన రాజకీయ ఉనికి కూడా ప్రశ్నార్థం అవుతుందనే ఆందోళన ఆయనలో ఉండొచ్చని చెబుతున్నారు. అందుకే సీటు త్యాగం చేసిన తనకు సమన్యాయం చేసే మరో పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను తెరమీదికి తెచ్చి ఉంటారని అంతా అనుకుంటున్నారు. పార్టీ పట్టించుకోకపోతే ఫలితాల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేరే నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నది.