కాంగ్రెస్ వస్తది.. దిగులు పడకు బిడ్డా!

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల ముంగిట పార్టీల ప్రచారం ఊరూరా హోరెత్తుతోంది. ఆయా పార్టీల అభ్యర్థుల తరపున పార్టీ శ్రేణులతో పాటు కుటుంబమంతా ప్రచారంలోకి దూకేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం పాలమూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తరపున సతీమణి ప్రసన్నా రెడ్డి ప్రచారం చేశారు. అప్పన్నపల్లి గ్రామంలో ఆమె ఇంటింటా తిరుగుతుండగా, ఓ వృద్ధురాలు ఎదురైంది.
ప్రసన్నా రెడ్డిని చూడగానే మురిసిపోయిన ఆ పండుటాకు ఆప్యాయతను ఒలకబోసింది. బుగ్గలు నిమురుతూ… ఆనందాన్ని పంచుకుంది. ‘బిడ్డా… ఎంత ముద్దొస్తున్నావ్.. ఓటు కోసం మా ఊరు వచ్చావా? నా ఓటు మాత్రం చేయి గుర్తుకే వేస్తా… మా కోసం ఇంతదూరం వచ్చావు తిన్నావా లేదా బిడ్డా! ఈసారి కాంగ్రెస్ వస్తది.. దిగులు పడకు’ అంటూ బోసి నవ్వులు చిందిస్తుండగా… ప్రసన్నా రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న పార్టీ శ్రేణులు, గ్రామస్థులు తదేకంగా చూస్తుండిపోయారు.