జడ్చర్లలో హోరాహోరీ
జడ్చర్ల నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి మధ్య పోరు తీవ్రతరం

– బీఆరెస్, కాంగ్రెస్ రసవత్తర పోరు
– పాదయాత్రతో గ్రామాలు చుట్టివచ్చిన అనిరుద్
– తెలంగాణ ఉద్యమ నేతగా లక్ష్మారెడ్డి
– కాంగ్రెస్ కు ఎర్ర శేఖర్ దెబ్బ
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: జడ్చర్ల నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి మధ్య పోరు తీవ్రతరం కానుంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడాలని ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. టికెట్ కేటాయించక పోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరారు.
కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి కంకణం కట్టుకుంటానని బీస్మా బూనారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని భావించిన ఎర్రశేఖర్, చివరి నిమిషంలో గులాబీకి జై కొట్టారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ ను వీడినా, జడ్చర్లలో ఆయన ప్రభావం ఏమీ ఉండదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ లో చేరిన ఆయన వల్ల ఇక్కడ పార్టీకి పెద్దగా ఉపయోగం లేదని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ సభతో గులాబీలో ఊపు
ఎర్ర శేఖర్ చేరికతో జడ్చర్ల బీఆర్ఎస్ నాయకుల్లో స్పందన ఏమీ లేకుండా పోయింది. అధికార పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఎవ్వరిపై ఆధారపడకుండా తన ప్రచారం తాను చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వ్యక్తిగా పేరున్న లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ హాజరై లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచారు.
తెలంగాణ కోసం పదవినే వదులుకున్న లక్ష్మారెడ్డి లాంటి వ్యక్తులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అయ్యారని, ఇలాంటి నాయకున్ని జడ్చర్ల ప్రజలు వదులుకుంటే ఈ ప్రాంతానికే నష్టం జరుగుతుందనే భావనను ఈ సభ ద్వారా ప్రజల్లోకి కేసీఆర్ తీసుకెళ్లారు. కేసీఆర్ సభతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
జనం మధ్యనే అనిరుద్
కాంగ్రెస్ నుంచి ఎర్ర శేఖర్ కు టికెట్ వస్తే బీఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఉండేదని.. అనిరుద్ రెడ్డికి ఇవ్వడంతో ఇక్కడ కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అనిరుద్ రెడ్డి కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారనే పేరుంది. పార్టీనే నమ్ముకున్న అనిరుద్, ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నారు. నెల రోజులకు పైనే ఈ యాత్ర చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు.
ఆయనకు పార్టీపై ఉన్న అభిమానంతోనే జడ్చర్ల నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించిందని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. అనిరుద్ కు టికెట్ వచ్చిన వెంటనే బీ ఆర్ఎస్ అలర్ట్ అయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ బలమైన నేతలుగా ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందనే భావనను ఇక్కడి నాయకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉండదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.