Telangana Politics | కాడి ఎత్తేసిన తెలంగాణ మంత్రులు? వ్యతిరేకతను రేవంత్‌పై నెట్టేసే యోచన!
గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అధికారులను పరుగులు పెట్టించే వారని అంటున్నారు. ఇప్పుడా పరిస్థితి లేక పోవడం వల్లనే అతి త్వరగా కాంగ్రెస్‌పై వ్యతిరేతక వస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది.

- మళ్లీ అధికారంలోకి రావడంపై సందేహాలు
- గ్రౌండ్‌లెవల్లో ప్రభుత్వంపై క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకత
- దీపం ఉండగానే ఇల్లుచక్కదిద్దుకునే పని
- ప్రభుత్వం రాకున్నా.. తాము గెలిస్తే చాలు!
- ప్రభుత్వ కార్యక్రమాలు పట్టని మంత్రులు
- వ్యతిరేకత వస్తే రేవంత్‌పై నెట్టేసే యోచన
- ప్రజల కష్టాలు వినేందుకు ఆసక్తి ఉందా?
- కల్లాల్లో పేరుకు పోయిన ధాన్యం గుట్టలు
- అక్కడే ఎండ తీవ్రతకు రైతుల మరణాలు
- ధాన్యం కల్లాలను మానిటర్ చేసేది ఎక్కడ?
- నేరుగా వెళితే రైతులు ప్రశ్నిస్తారని భయమా?
- రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చలు
హైదరాబాద్, మే 15 (విధాత):
Telangana Politics | తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రౌండ్ లెవల్‌లో వ్యతిరేకత మొదలవుతున్నదనే సంకేతాలు క్రమక్రమంగా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి ఇది ఏ స్థాయికి వెళుతుందనేది ఇప్పుడే ఊహించలేని పరిస్థితి ఉన్నది. కానీ.. కీలకమైన ఇటువంటి సందర్భాల్లో ప్రజలను ఒప్పించి, మెప్పించి, వ్యతిరేకతను దూరం చేసే ప్రయత్నాల్లో ఉండాల్సిన మంత్రులు.. తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంబంధించిన విషయమేకానీ.. తమది కాదనే ధోరణి మంత్రుల్లో కనిపిస్తున్నదని రాష్ట్ర రాజకీయాలను దగ్గరి నుంచి పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. పథకాల అమలు సరిగ్గా లేకపోయినా, వ్యతిరేకత వచ్చినా అది రేవంత్ తప్పు కిందకే వస్తుందన్న తీరులో ఉన్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకతను రేవంత్‌పైనే మోపి, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి, చేతులు దులుపుకొంటే సరిపోతుందన్న తీరుగా ఒకరిద్దరు మంత్రులున్నట్లు చర్చ జరుగుతున్నది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాము మాత్రం గెలిస్తే చాలన్న తీరులో మంత్రుల వ్యవహారం ఉన్నదని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు. మొత్తంగా మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో కూడా వినిపిస్తున్నది.
నియోజకవర్గాలకే కొందరు మంత్రులు పరిమితం!
కొంత మంది మంత్రులు తమ జిల్లాలోని నియోజకవర్గాలే కాకుండా.. కనీసం పక్కన నియోజకవర్గాన్ని సైతం పట్టించుకోవడం లేదని అంటున్నారు. సొంత జిల్లా మంత్రి అనే భావనతో నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం వెళితే మంజూరు కావడం లేదని, దీంతో నియోజకవర్గంలో ప్రజలకు ముఖం చూపించుకోలేని స్థితి ఉన్నదని ఒక ఎమ్మెల్యే తన సన్నిహిత వర్గాలతో వాపోయినట్టు తెలిసింది. దీంతో మొత్తంగా మంత్రులు కాడి ఎత్తేశారా? అన్న సందేహాలు కలుగుతున్నాయని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు.
ప్రజల ఇబ్బందులు తెలుసుకోరా?
మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకొవడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇచ్చే లెక్కలనే పట్టుకొని మాట్లాడుతున్నారని అంటున్నారు. మే 14వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2022-23 రబీలో 19.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2023-24 రబీలో 29.88 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25 రబీలో 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వాస్తవానికి ప్రతి ఏటా ధాన్యం ఉత్పత్తి సహజంగానే పెరుగుతున్నది. ప్రజలకు కావాల్సింది ఈ లెక్కలు కాదు కదా! ఇప్పటికీ రోడ్లపై, కల్లాల్లో ధాన్యం ఉన్న మాట వాస్తవం కాదా? కల్లాలపైనే రైతులు వడదెబ్బలకు నేలకు ఒరుగుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్ల్యేలు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి మానిటరింగ్ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళితే రైతులు అడ్డుకుంటారన్న భయం ఎందుకు? వారికి సమాధానం ఎందుకు చెప్పలేక పోతున్నారన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది.
బీఆరెస్ పాలనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మంత్రులు
గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అధికారులను పరుగులు పెట్టించే వారని అంటున్నారు. ఇప్పుడా పరిస్థితి లేక పోవడం వల్లనే అతి త్వరగా కాంగ్రెస్‌పై వ్యతిరేతక వస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలా తాగు నీరు, సాగునీటి అంశాలలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కాలువల వెంటనే . చివరి చెరువుల వద్దకు నీళ్లు వెళ్లాయా లేదా నిత్యం పరిశీలించి. ఎక్కడైనా చివరి చెరువుకు నీళ్లు రాక పోతే వెంటనే అధికారులను పురమాయించేవాళ్లు.. సమస్య పెద్దదైతే వెంటనే సీఎం ఆఫీస్‌ను కంటాక్ట్ చేసి, సీఎంతో మాట్లాడే వాళ్లు.. ఒక మంత్రి నేరుగా ఆయకట్టు చివరిచెరువు ఉన్న గ్రామానికి ఫోన్ చేసి మీ చెరువు నిండిందా అని అడిగే వాడట.. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు చెప్పుకుంటారు.. ఒక ఎమ్మెల్ల్యే ఒక సీజన్‌లో మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులు, అధికారులతో మాట్లాడే వాడని స్థానికులు చెప్పుకుంటారు. ఇలా నిత్యం ప్రజల్లో ఉండం ద్వారా ప్రజా వ్యతిరేకతను అధిగమించ వచ్చు కానీ.. ఎవరికి వారు తమకెందుకులే అని అనుకోవడం వల్లనే ప్రజా వ్యతిరేకతకు కాంగ్రెస్ ప్రభుత్వం గురవుతుందన్న చర్చ జరుగుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు నియోజక వర్గాలలో, మంత్రులు వారి సొంత జిల్లాలలో అన్ని నియోజకవర్గాలు తిరిగితే ఈ వ్యతిరేకత రాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కానీ ప్రజా వ్యతిరేకతను రేవంత్‌పై కి నెడదాం.. అన్నతీరుగా మంత్రులు కూడా ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. రేవంత్‌పై నెపం మోపాలని సంబర పడవచ్చునేమో కానీ మొత్తం పడవే మునిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka | తెలంగాణలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : భట్టివిక్రమార్క
Sama Rammohan Reddy: తండ్రికి రాసిన లేఖలో ఏమున్నదో కవిత బయటపెట్టాలి
NVSS Prabhakar: రేవంత్ రెడ్డి స్థానంలో సీఎంగా మళ్లీ కేసీఆర్..
Maleriraptor kuttyi | తెలంగాణలో జీవించిన డైనోసార్ మలేరిరాప్టర్ కుట్టి.. కథాకమామిషేంటి?