వ్య‌వ‌సాయం (Agriculture) లోకి కూడా ప్ర‌పంచీక‌ర‌ణ‌, కార్పొరేట్ విధానాలు రావ‌డంతో దాని రూపురేఖ‌లే మారిపోయాయి.

విధాత‌: వ్య‌వ‌సాయం (Agriculture) లోకి కూడా ప్ర‌పంచీక‌ర‌ణ‌, కార్పొరేట్ విధానాలు రావ‌డంతో దాని రూపురేఖ‌లే మారిపోయాయి. కేవ‌లం అధిక దిగుబ‌డులు ఇచ్చే విత్త‌నాల‌ను మాత్ర‌మే ఉప‌యోగించ‌డం, పురుగు మందులు విరివిగా వాడ‌టం అధిక‌మైంది. దీంతో మ‌న పూర్వీకులు అభివృద్ధి చేసిన‌ కొన్ని దేశ‌వాళీ విత్త‌నాలు అంత‌రించే ద‌శ‌కు చేరుకున్నాయి.


మ‌రోవైపు ఇప్పుడు వ్య‌వ‌సాయంలో వ‌చ్చిన మార్పులు రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయా అంటే అదీ లేదు. దిగుబ‌డులు త‌గ్గిపోవ‌డం, విత్త‌నాల నాణ్య‌త త‌గ్గిపోవ‌డంతో చాలా మంది చిన్న. స‌న్న‌కారు రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. అలా క‌ష్టాలు ఎదుర్కొన్న వారిలో ఒడిశా (Odisha) లోని మ‌ల్కాన్‌గిరి జిల్లా మౌలిగూడ‌కు చెందిన గిరిజ‌న మ‌హిళ (Tribal Woman) జ‌మునా కిర్సానీ ఒక‌రు. దేశ‌వాళీ విత్త‌నాలు, అరుదైన విత్త‌నాల‌ను భ‌విష్య‌త్తు త‌రాల కోసం దాచి ఉంచాల‌ని.. వాటి విలువ ఎప్ప‌టికైనా తెలుస్తుంద‌ని త‌ను భావించారు.

ప్ర‌కృతిని నాశ‌నం చేసే వ్య‌వ‌సాయం కాకుండా దానితో మ‌మేక‌మై చేసే సాగే మంచిద‌ని అర్థం చేసుకున్నారు. దీంతో అరుదైన, అంత‌రించిపోతున్న దేశ‌వాళి విత్త‌నాల‌ను ఆమె సంర‌క్షించ‌డం (Seed Conservation) ప్రారంభించారు. అదీ కూడా ఆధునిక ప‌ద్ధ‌తుల్లో కాకుండా త‌న పూర్వీకుల నుంచి ప‌రంప‌ర‌గా వ‌స్తున్న విధానాల‌లోనే చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌కు పైగా ర‌కాల విత్త‌నాలను సుర‌క్షిత ప‌ద్ధ‌తుల్లో నిల్వ చేసి సంర‌క్షించారు.


ఊరి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చి...

ఈ య‌జ్ఞంలో జ‌మున తన ఊరు, ప‌క్క ఊరి మ‌హిళ‌ల‌ను కూడా భాగం చేశారు. వారికి తాను నేర్చుకున్న విత్త‌న సంర‌క్ష‌ణ ప‌ద్ధ‌తుల‌ను వివ‌రించి శిక్ష‌ణ ఇచ్చారు. తాము అనుస‌రించే విధానాల్లో స్థానిక మూలిక‌లు, జంతువుల పేడ‌, వేప, నిమ్మ‌, నారింజ చెట్ల ఆకులు, బుర‌ద‌, బూడిద వంటి వాటిని ఉప‌యోగిస్తామ‌ని జ‌మున తెలిపారు. విత్త‌నం ర‌కాన్ని బ‌ట్టి సంర‌క్షించే విధానం మారుతుంద‌న్నారు. 'పంట ఎద‌గ‌డానికి మ‌ట్టి మాత్ర‌మే అవ‌స‌రం. అది బాగుంటే దిగుబ‌డి దానిక‌దే బాగుంటుంది.

కానీ ప్ర‌స్తుత కాలంలో ఆ మ‌ట్టే క‌లుషిత‌మ‌వుతోంది' అని ఆమె వాపోయారు. ఈ ర‌సాయ‌న పురుగుమందుల‌కు ప్ర‌త్యామ్నాయంగా పంట వ్య‌ర్థాలు, ఆవు పేడ‌, మూత్రం, కోడి, మేక విస‌ర్జితాలను ఉప‌యోగించి సేంద్రియ ఎరువుల‌నూ త‌యారుచేస్తున్నామ‌ని తెలిపారు. ఈ విధానాన్ని కూడా మ‌హిళా రైతులకు వివ‌రిస్తున్నామ‌ని.. వారిని కూడా ఈ మార్గంలోకి రావాల‌ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని వివ‌రించారు.వార్షిక ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌..

రైతుల‌కు లాభాలు తీసుకురావాల‌నే ఉద్దేశంతో జ‌మున ఒక కొత్త ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టారు. అదే వార్షిక సాగు ప్ర‌ణాళిక‌. ఇందులో భాగంగా ప్ర‌తి ఏడాది మొద‌ట్లో రైతులంద‌రితో ఒక స‌మావేశం ఏర్పాటు చేస్తారు. ప్ర‌తి రైతు తాను వేయాల‌నుకున్న పంట‌కు సంబంధించి ఏ విత్త‌నం వేస్తున్నారో చెప్పాలి. అది దేశ‌వాళీదై, తాము సంర‌క్షిస్తున్న వాటిలో ఒక‌టై ఉండాలి. అనంత‌రం స‌మావేశంలో చ‌ర్చించి ఏ రైతుది ఏ ర‌కం నేల‌, వారు వేయాల‌నుకున్న ఏ పంట‌, ఏ విత్త‌నం, దానికి మ‌ద్ద‌తు ధ‌ర ఎలా ఉంది వంటి అంశాల‌ను చ‌ర్చించి తుది నిర్ణ‌యానికి వ‌స్తారు. ఆ స‌మావేశ నిర్ణ‌యాల‌కు క‌ట్టుబ‌డే వారి సాగు ఉంటుంది.

ఈ విధానంలో అక్క‌డి రైతులంద‌రూ ప్ర‌స్తుతం ప్ర‌శాంతంగా, లాభ‌దాయ‌కంగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్నార‌ని జ‌మున తెలిపారు. తాను ఈ విత్త‌న సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టి ఇప్ప‌టికి ఏడుళ్లు కాగా.. ఈ స‌మ‌యంలో 32 ర‌కాల వ‌రి విత్త‌నాలు, ఏడు ప‌ప్పు ధాన్యాల విత్త‌నాలు, నాలుగు రాగి, 21 ర‌కాల కూర‌ల విత్త‌నాల‌ను భ‌ద్ర‌ప‌రిచిన‌ట్లు జమున తెలిపారు. త‌న విజ‌యంలో భ‌ర్త రామ‌చంద్ర కిర్సానీ స‌హ‌కారం కూడా ఎంతో ఉంద‌ని ఆమె అన్నారు.వ‌ర్షాకాలంలో సుమారు 20 ర‌కాల కూర‌గాయ‌ల‌ను, ఎండాకాలంలో 10 ర‌కాల కూర‌గాయ‌ల‌ను పండించి విత్త‌నాలను సేక‌రించే జ‌మున కుటుంబం.. చేప‌ల పెంప‌కం, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాల‌ను చేస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ప్ర‌కృతితో మ‌మేక‌మై జీవించ‌డం మా గిరిజ‌న స‌మూహాల‌కే ద‌క్కిన వ‌రం. దానిని అలాగే కాపాడుకోవాల‌ని ఆమె అన్నారు. జ‌మున‌ చేస్తున్న కృషికి స‌హ‌చ‌ర రైతులు ఆమెకు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా... సీడ్ మ‌ద‌ర్‌ (Seed Mother). త‌మ కోసం ఇంత‌లా కృషి చేసిన తోటి మ‌హిళా రైతులో అమ్మ‌ను చూశారు ఇక్క‌డి రైతులు.

Somu

Somu

Next Story