Banakacharla Project | పెండింగ్ ప్రాజెక్టుల సంగతేంటి బాబూ!
పోలవరం - సోమశిల పథకంగా చేపట్టి బొల్లాపల్లి రిజర్వాయరు మీదుగా ప్రకాశం జిల్లాలోని నాగార్జునసాగర్ రెండవ దశ ప్రతిపాదిత ఆయకట్టుకు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయర్ అయిన నల్లమలసాగర్ కు నీటిని అందిస్తూ, సోమశిలకు అనుసంధానించాలంటున్నారు. సోమశిల ఆయకట్టుకు, కండలేరు ద్వారా నెల్లూరుకు, తిరుపతి జిల్లాల్లోని తెలుగు గంగ , గాలేరు – నగరి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు నీటిని అందించవచ్చునని చెపుతున్నారు.

Banakacharla Project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకరచర్ల ప్రాజెక్టుపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నది. బనకచర్లతో ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకే ప్రయోజనం తప్ప.. రాయలసీమ ప్రజలకు కాదని తెగేసి చెబుతున్నారు ఆంధ్ర ఆలోచనాపరులు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించి, తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన వేదిక సభ్యులు.. తాజాగా జూన్ 27న ఏపీ ముఖ్యమంత్రికి వివరంగా లేఖ రాశారు. సుమారు 80వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు.. కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి కలిగించడంతోపాటు.. కమీషన్లు దండుకునే ప్రాజెక్టుగా మిగిలిపోతుందని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ.. కేసీఆర్‌కు ఏటీఎం వంటిదని వ్యాఖ్యానించారని, ఇప్పుడు బనకచర్లతో చంద్రబాబుపైనా ఇటువంటి ఆరోపణలే వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మెట్ట ప్రాంత రైతులకు.. సాగర్ కుడికాలువ, ఎడమ కాలువ చివరి ఆయకట్టు స్థిరీకరణకు కావాల్సింది సాగునీరు మాత్రమేనని అంటున్నారు. దీనికోసం 80 వేల కోట్ల ప్రాజెక్ట్ అవసరం లేదని, కొద్దిపాటి నిధులతో పోలవరం.. సోమశిల చాలని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ చేపట్టిన జల యజ్ఙం ప్రాజెక్ట్‌ను లక్ష కోట్ల ధన యజ్ఞం ప్రాజెక్ట్‌గా ఆరోపణలు చేసి, పుస్తకాలు వేసి ప్రజల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. తాగా స్వయంగా తనపైనే అటువంటి ప్రచారాలు జరిగే పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సమాజం ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోకుండా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసి, నాటి టీఆర్ఎస్ను చిల్లం కల్లం చేసి.. పోతిరెడ్డిపాడు వద్ద ఏకంగా కృష్ణా నదినే మళ్లించుకుపోయారు. ఏకకాలంలో 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. పోతిరెడ్డిపాడు కాలువను పెద్దగా వెడల్పు చేశారు. దీంతో అప్పటి నుంచి కృష్ణాలో ఏపాటి వరద వచ్చినా ముందుగా రాయలసీమకే నీళ్లు వెళుతున్నాయి. ఏటా 200 టీఎంసీలకు పైగా నీటిని పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ద్వారా రాయలసీమకు అంటే.. రోజుకు 9.12 టీఎంసీల నీటిని తరలిస్తున్నది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కృష్ణా నుంచి ప్రతి ఏటా 200 టీఎంసీలకు పైగా రాయలసీమకు నీటిని తీసుకుంటున్నప్పడు.. అదనంగా గోదావరి జలాల అవసరం రాయలసీమకేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాయలసీమలో హంద్రీ-నీవా ప్రధాన కాలువను 6100 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాల్సి ఉంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఆ పనులు చేయకుండా లైనింగ్ వేసి మమ అనిపించారన్న విమర్శలు ఉన్నాయి. గాలేరు- నగరి రెండవ దశలో కీలకమైన కడప- కోడూరు ప్రధాన కాలువను ఎందుకు నిర్మించడం లేదని పౌరసమాజం చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అలాగే శ్రీశైలం కుడి కాలువకు గుండెకాయ లాంటి గోరకల్లు రిజర్వాయర్ ను ఎందుకు అసంపూర్తిగా వదిశారని అడుగున్నారు. వీటితో పాటు రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కృష్ణా నీటితో నింపుతున్నారు కానీ వాటిని రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు. రైతులకు నీరు అందించడంలో కీలకమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అయ్యే వ్యయం అతి తక్కువ. ఎందుకు నిధులు విడుదల చేయడం లేదంటున్నారు. తక్కువలో పూర్తయ్యే వాటికి డబ్బులు లేవంటున్న సర్కారు.. రూ. 80 వేల కోట్లు పెట్టి బనకచర్ల నిర్మించి ప్రజలకు ఏమి సందేశం ఇద్దామనుకుంటున్నారని ఆంధ్రా పౌరసమాజం చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
కేసీఆర్+జగన్+ గుత్తేదారు= బనకచర్ల
‘‘గోదావరి – బనకచెర్ల ’’ కేసీఆర్ – జగన్మోహన్ రెడ్డి – ఒక గుత్తేదారు సంస్థ అధినేత మధ్యవర్తిత్వంతో పుట్టుకొచ్చిన పథకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని, అది వాస్తవం అని ఆంధ్రా మేధావిలోకం స్పష్టం చేస్తున్నది. ఆ పథకంపై అడుగు ముందుకు వేస్తే మీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబును హెచ్చరించింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌తో ముడిపెట్టే ఈ పథకం కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులకు, మరీ ప్రత్యేకంగా కరువు పీడిత రాయలసీమ నీటి హక్కులకు ప్రమాదకారిగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
మెట్ట ప్రాంత ప్రజలకు నీళ్లు ఇస్తే చాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రకాశం, నెల్లూరు. గుంటూరు మెట్ట ప్రాంత ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు. గుంటూరు మెట్ట ప్రాంత రైతులతో పాటు ఆంధ్రాలోని జగ్గయ్యపేటకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన సాగర్ ఎడమకాలువ ఆయకట్టు చివరి ప్రాంత ప్రజలకు సాగునీరు అందించడానికి పోలవరం- సోమశిల చేపడితే చాలని ఏపీ జల నిపుణులు అంటున్నారు.
నీటిని ఇలా వినియోగించుకోవచ్చు
పోలవరం – సోమశిల పథకంగా చేపట్టి బొల్లాపల్లి రిజర్వాయరు మీదుగా ప్రకాశం జిల్లాలోని నాగార్జునసాగర్ రెండవ దశ ప్రతిపాదిత ఆయకట్టుకు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయర్ అయిన నల్లమలసాగర్ కు నీటిని అందిస్తూ, సోమశిలకు అనుసంధానించాలంటున్నారు. సోమశిల ఆయకట్టుకు, కండలేరు ద్వారా నెల్లూరుకు, తిరుపతి జిల్లాల్లోని తెలుగు గంగ , గాలేరు – నగరి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు నీటిని అందించవచ్చునని చెపుతున్నారు. దీంతో కృష్ణా జలాలపై ఒత్తిడి తగ్గించవచ్చునని చెపుతున్నారు. పెన్నా నీటిని ఆదా చేసి, రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించవచ్చునని అంటున్నారు.
బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాల్సిందే
గోదావరి – పెన్నా అనుసంధానాన్ని, పోలవరం – సోమశిల అనుసంధాన పథకంగా మార్చాలని ఆంధ్రా మేధావులు చంద్రబాబును కోరుతున్నారు. పోలవరం కుడి కాలువకు ఎగువ భాగంలో చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరందిస్తూ, వైకుంఠాపురం వద్ద కృష్ణా నదిని, అటుపై నాగార్జునసాగర్ ను అక్విడక్ట్‌ల ద్వారా దాటించి, నూతనంగా నిర్మించతలపెట్టిన బొల్లాపల్లి జలాశయానికి చేర్చడం ఎంతో ప్రయోజనకరమని ఆంధ్రా మేధావులు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా కృష్ణా డెల్టా తోపాటు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు నీటిని అందించవచ్చునని చెపుతున్నారు. తద్వారా కృష్ణా జలాలను ఆదాచేసి, శ్రీశైలం జలాశయం మీద ఆధారపడి నిర్మించిన, నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించ వచ్చునని తెలిపారు. అవసరమైన మేరకు ప్రధాన కాలువల విస్తరణకు ప్రభుత్వం గతంలోనే పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చిందని,ఆ పనులను సత్వరం పూర్తి చేయాలని కోరుతున్నారు.
వీటిని కూడా చదవండి..
Banakacharla Controversy | ఆంధ్రా కాళేశ్వరం.. బనకచర్ల! ఇక్కడా, అక్కడా మేఘా కోసమే!
Banakacherla| బనకచర్లపై పునరాలోచన చేయాలి: సీఎం చంద్రబాబుకు ఏపీ నిపుణుల లేఖ
Banakacharla | పోలవరం – బనకచర్ల మనకొద్దంటూ ఏపీలో ఉద్యమం.. కారణాలివే..