Telangana Real Estate | ఆరేళ్లుగా రియల్‌ఎస్టేట్ నేల చూపులు.. వేచి చూసే ధోరణిలో రియల్టర్లు
భూములు, ఫ్లాట్ల ధరలు సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. నెలకు లక్ష రూపాయల వేతనం తీసుకునే వాళ్లు కూడా పెరిగిన ధరల ప్రభావంతో 1000 చదరపు అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల ఎస్ఎఫ్‌టీ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పైనే అమ్ముతుండటంతో ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటమే మేలన్నఅభిప్రాయం సగటు వేతన జీవుల్లో ఏర్పడుతున్నది.

Telangana Real Estate | హైదరాబాద్, జూలై 8 (విధాత): తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం ఆరేడేళ్లుగా నేల చూపులు చూస్తోంది. మళ్లీ పూర్వవైభవం ఇప్పట్లో వస్తుందన్న నమ్మకం కూడా ఈ వ్యాపారంలో ఉన్నవారిలో కనిపించడం లేదు. కొంత కాలం వేచి చూడటమే మంచి వ్యాపార వేత్త లక్షణం అని ఈ రంగంలోని వారు చెబుతున్నారు. భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు, అమ్మకాలు, వ్యాపారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమే గీటురాయి. కాగ్ నివేదికలో 2020-21 నుంచి 2025-2026 ఆర్థిక సంవత్సరాల రాష్ట్ర ఆదాయం వ్యయాల రిపోర్ట్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చిన ఆదాయం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతున్నది. బీఆరెస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల కొనుగోలుదారులకు, అమ్మకం దారులకు నమ్మకం కల్పించలేక పోయారని, అందుకే భూ క్రయవిక్రయాల ఆదాయం పడిపోయిందన్న చర్చ ఆర్థిక రంగ నిపుణుల్లో జరుగుతున్నది. అప్పటి నుంచి తిరోగమన దిశలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా భరోసా కల్పించ లేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ధరణి ఎఫెక్ట్‌తో..
భూముల విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకున్న తరువాతనే క్రయవిక్రయాల్లో మందగమనం మొదలైందనే వాదనలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులంతా అవినీతి పరులని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, భూ సమస్యలు లేకుండా చేస్తానని చెప్పిన కేసీఆర్.. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ తరువాత ల్యాండ్ రికార్డులన్నీ సీజ్ చేసి ధరణి చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో వీఆర్వోలను తీసి వేయడంతోపాటు.. ఎమ్మార్వో, ఆర్డీఓలకు సమస్యలు పరిష్కరించే అధికారం లేకుండా చేశారు. ఎవరైనా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని సీఎం హోదాలో కేసీఆర్ నేరుగా అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. దీంతో భూమి సమస్యలు పెరిగిపోయాయి.. మార్కెట్‌లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అలాగే అనధికార లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. భూమి రికార్డు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం అంచనా వేయగా వచ్చింది రూ. 5243.28 కోట్లు మాత్రమే. 2020 ఏప్రిల్‌లో వచ్చిన ఆదాయం రూ.21.40 కోట్లు మాత్రమే. దీనికితోడు 2020, 2021లలో రెండు దశలలో కరోనా ఎఫెక్ట్ కూడా పడింది. అప్పట్లో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి నుంచి కూడా బయటకు వెళ్లలేదు. వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. అది సహజంగానే రియల్ ఎస్టేట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
భరోసా లేక…
2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనుగోలుదారులకు భరోసా కల్పించలేకపోయారనే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో సాగుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారిందని అంటున్నారు. భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకాలు పాతాళానికి పడిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారం పుంజుకుంటుందని భావించి వేచి చూస్తున్న వాళ్లంతా తాజా పరిణామాలతో నిరాశా నిస్పృహలలో ఉన్నారు. ఈ రంగంలో ఉన్న వాళ్లు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. మార్కెట్ వర్గాలకు, కొనుగోలుదారులకు రేవంత్ సర్కారు భరోసా ఇవ్వలేక పోతున్నదని, అందుకే అమ్మకాలు సాగడం లేదని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన ధరల ప్రభావం
భూములు, ఫ్లాట్ల ధరలు సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. నెలకు లక్ష రూపాయల వేతనం తీసుకునే వాళ్లు కూడా పెరిగిన ధరల ప్రభావంతో 1000 చదరపు అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల ఎస్ఎఫ్‌టీ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పైనే అమ్ముతుండటంతో ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటమే మేలన్నఅభిప్రాయం సగటు వేతన జీవుల్లో ఏర్పడుతున్నది. మరో వైపు ప్రయివేట్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. అనేక మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న భయాందోళనల్లో ఉన్నారు. చాలామందికి ఉద్యోగాలు పోయాయన్న చర్చ జరుగుతున్నది. ఉద్యోగం పోతే ఈఎంఐ చెల్లించడం పెను భారంగా తయారవుతుందనే భయం వెంటాడుతున్నది. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగువారికి ఉద్యోగాలు రాకపోవడం, ఉన్న ఉద్యోగాలు పోవడం కూడా సొంతగడ్డపై పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. మారిపోతున్న పరిస్థితుల్లో సంపాదించుకున్న నాలుగు రాళ్లు ఖర్చు పెట్టడం కన్నా దాచుకోవడమే మేలన్న అభిప్రాయంతో ఉన్నామని అమెరికాలో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు తెలిపారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం సంవత్సరాల వారీగా (రూ. కోట్లలో)
సంత్సరం | అంచనా | వచ్చినది |
2020-21 | 10,000 | 5,243.28 |
2021-22 | 12,500 | 12,372.73 |
2022-23 | 15,600 | 14,228.19 |
2023-24 | 18,500 | 14,295.56 |
2024-25 | 18,228.91 | 8,473.21 |
2025-26 | 19,087.26 | 2513.44 (ఏప్రిల్, మే) |