ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణలో కేసీఆర్ త‌ర‌హాలో ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ ఆరు జాబితాలు విడుద‌ల చేశారు.

  • వైసీపీ అభ్య‌ర్థుల ఆర్థిక క‌ష్టాలు షురూ!
  • రోజువారీ ఖ‌ర్చుల‌తో బేజారు
  • సిద్ధం స‌భ‌ల‌కు జ‌నం టార్గెట్‌తో ప‌రేషాన్‌
  • అసంతృప్త క్యాడ‌ర్ ప్యాకేజీతో ల‌బోదిబో

(విధాత ప్ర‌త్యేకం)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణలో కేసీఆర్ త‌ర‌హాలో ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ ఆరు జాబితాలు విడుద‌ల చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ నెలాఖ‌రులోగా పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేసే ప‌నిలో ఉన్నారు. మొద‌టి జాబితా జ‌న‌వ‌రిలోనే ప్ర‌క‌టించారు. త‌రువాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు జాబితాలు విడుద‌ల చేశారు. మొత్తం 82 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. రేపో, మాపో ఏడో జాబితా కూడా రానున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సీట్లు ఖరారు చేసిన అభ్య‌ర్థుల‌కు రోజువారీ ఖ‌ర్చులు వాచిపోతున్నాయంటున్నారు.

రోజుకు స‌గ‌టున 5 నుంచి 10 ల‌క్ష‌ల వ్య‌యం

పోటీ చేసే అభ్య‌ర్థి ఖ‌రారు కావ‌డంతో ఆర్థిక ఖ‌ర్చులు మొద‌లైపోయాయి. అభ్య‌ర్థి ఇంటికి రోజూ వంద‌ల‌మంది మంది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రావ‌డం మొద‌లైపోయింది. వారికి కాఫీలు, టీలు, నాన్‌వెజ్ భోజనాలు కోస‌మే రోజూ ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. ఇక గుళ్లు, మ‌సీదులు, చ‌ర్చిల నిర్మాణం చందాలతోపాటు, కార్య‌క‌ర్త‌ల‌ ఇబ్బందులు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, పెళ్లిళ్లు, పేరంటాలు, బ‌ర్త్‌డే ఫంక్ష‌న్లు, గిఫ్టులు పేరుతో రోజూ రెండు మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌దిలుతున్నాయి.

వెంట తిరిగేందుకు మ‌నుషులు, వాహ‌నాలు, డీజిల్, లిక్క‌ర్ ఖ‌ర్చు త‌క్కువ‌లో త‌క్కువ ల‌క్ష రూపాయ‌లు పెట్టాల్సి వ‌స్తోంది. దీనికితోడు ప్ర‌చార వాహ‌నాలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు, వాల్‌పోస్ట‌ర్లు, ఆత్మీయ స‌మ్మేళ‌నాలు, కుల‌సంఘాల మీటింగులు, అసంతృప్త పార్టీ నేత‌ల‌కు తాయిలాల రూపంలో క‌నీసం 5 ల‌క్ష‌లు రోజుకు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. మీడియా, పోలీసు, రెవెన్యూ అధికారుల చేతులు త‌డిపే ఖ‌ర్చు దీనికి అద‌నం.

ఇలా నెల‌కు 3 కోట్ల రూపాయ‌లు చేతి చ‌మురు వ‌దులుతుంటే, తీరా ఎన్నిక‌ల నాటికి చేతిలో డ‌బ్బులు అయిపోతాయేమోన‌న్న ఆందోళ‌న అభ్య‌ర్థుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. త‌ప్పించుకుందామని ఎవ‌రైనా నాలుగైదు రోజులు బ‌య‌ట ప్రాంతానికి వెళుతుంటే, డ‌బ్బులు లేవ‌ని, ఎన్నిక‌ల్లో ఏం గెలుస్తాడ‌నే దుష్ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అధికార పార్టీ అభ్య‌ర్థుల ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక చెక్క‌లా మారింది.

మూలిగే న‌క్క‌పై తాడిపండులా ‘సిద్ధం’ స‌భ‌లు!

వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలా మారిన ‘సిద్ధం’ స‌భ‌లు ఉమ్మ‌డి జిల్లాకు ఒక‌టి చొప్పున పెడుతున్నారు. ఈ స‌భ‌ల‌కు ఒక్కో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌నీసం 20 వేల మంది జ‌నాన్ని త‌ర‌లించాల‌న్న‌ది ష‌ర‌తుగా విధిస్తున్నార‌ని స‌మాచారం. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అయినా టార్గెట్ జ‌నం రాలేదంటే, అక్క‌డ అభ్య‌ర్థిని మార్చివేస్తామ‌ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు హుకుం జారీ చేసేశార‌ని తెలుస్తోంది.

దీంతో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అభ్య‌ర్థి నెత్తిన పిడుగుప‌డ్డ‌ట్టు అయింది. 20 వేల మందిని త‌ర‌లించేందుకు ఒక్కొక్క‌రిపై బిర్యానీ, లిక్క‌ర్‌, ట్రాన్స్‌పోర్టు చార్జీల‌ను క‌లిసి క‌నీసం 1000 రూపాయిలు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ స‌భ‌కు జ‌నం త‌ర‌లించేందుకు రెండు నుంచి 3 కోట్ల రూపాయ‌లు జిడ్డు వ‌దులుతోంది. అధికార పార్టీ సిద్ధం స‌భ‌లు వైసీపీ అభ్య‌ర్థుల‌కు మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టుగా మారాయ‌ని వాపోతున్నారు.

అసంతృప్త క్యాడ‌ర్ ప్యాకేజీతో ల‌బోదిబో!

అధికార పార్టీ అభ్య‌ర్థుల‌కు అసంతృప్త క్యాడ‌ర్ ప్యాకేజీ భారంగా మారింది. ఎమ్మెల్యేల స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప్యాకేజీ భారం మ‌రీ ఘోరంగా ఉంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచ‌రుల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికి భారీగానే డ‌బ్బులు పంచాల్సి వస్తోంద‌ని స‌మాచారం. ఇక వైసీపీ ప్ర‌భుత్వంలో వార్డు మెంబ‌ర్ నుంచి ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, స‌ర్పంచ్‌ల వ‌ర‌కూ ఈ ఐదేళ్లు పైసా సంపాద‌న లేకుండా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇలాంటి వారంద‌రికీ క‌డ‌ప జిల్లా రోల్ మోడ‌ల్‌గా ఒక రేటు ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ఫార్ములా ప్ర‌కారం వైసీపీ అసంతృప్త క్యాడ‌ర్‌కు ప్యాకేజీకే ప‌ది కోట్ల వ‌ర‌కూ పంచాల్సి వ‌స్తోంద‌ని పేరు రాయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని రాయ‌ల‌సీమ వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి వాపోయారు. ఇక ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నేత‌లు భారీగా ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంచుతార‌నే ప్ర‌చారం జ‌రిగిపోయింది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని... ఓటుకు జ‌గ‌న్ ఐదువేలు పంచుతాడ‌నే వార్త ప‌ల్లెప‌ల్లెకు చేరింది.

ఐదు వేలు కాక‌పోయినా 2 వేలు అయినా పంచాల్సిన దుస్థితి దాపురించింది. నియోజ‌క‌వ‌ర్గంలో కనీసం లక్షా 20 వేల మంది ఓట‌ర్ల‌కి 2 వేల చొప్పున పంచాల్సి ఉంది. దీనికి అద‌నంగా బూత్ క‌న్వీన‌ర్లు, ఎన్నిక‌ల ఏజెంట్లు, పోలింగ్ సామాగ్రి ఖ‌ర్చు ఉండ‌నే ఉంటుంది. ఏతావాతా వీటికి 30 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖ‌ర్చుల కోసం దాచుకున్న డ‌బ్బు మొత్తం అభ్య‌ర్థుల‌ను ముందుగా ప్ర‌క‌టించిన చోట ఖ‌ర్చు పెట్టాయాల్సి వ‌స్తోంద‌ని, అస‌లు స‌మ‌యానికి చేతిలో చిల్లిగ‌వ్వ లేని ప‌రిస్థితి వ‌స్తే కింక‌ర్త‌వ్యం? అన్న ఆందోళ‌న అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.

Updated On 9 Feb 2024 11:41 AM GMT
Somu

Somu

Next Story