Maharashtra | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Maharashtra | ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతులంతా ఔరంగాబాద్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే బాధితులు ప్రయాణిస్తున్న ఓ ప్రయివేటు బస్సు.. కంటైనర్‌ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. అయితే ప్రయివేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.