మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
మారణాయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. దొంగల చేతుల్లో తుపాకీ, కత్తి ఉన్నప్పటికీ ఏ మాత్రం బెదరకుండా.. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను పారిపోయాడు.

హైదరాబాద్ : మారణాయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. దొంగల చేతుల్లో తుపాకీ, కత్తి ఉన్నప్పటికీ ఏ మాత్రం బెదరకుండా.. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేట పైగా కాలనీలో గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘటన దృశ్యాలు ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. నవరతన్ జైన్, అమిత్ మహోత్(46) దంపతులు తమ కుమార్తెతో కలిసి పైగా కాలనీలో నివాసం ఉంటున్నారు. నవరతన్ ఇంట్లో లేడని దొంగలు నిర్ధారించుకున్నారు. దీంతో మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో ఆ ఇంటి తలుపు వద్దకు చేరుకుని, కొరియర్ వచ్చిందంటూ పిలిచారు. అయితే వారిద్దరూ తమ ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్కు, మరొకరు హెల్మెట్ ధరించారు. తలుపు తెరవగానే ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. నాటు తుపాకీ, కత్తితో బెదిరించారు. ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకురావాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు.
దుండగుల బెదిరింపులకు ఇంట్లో ఉన్న తల్లీకూతుళ్లు ఏ మాత్రం బెదరలేదు. హెల్మెట్ ధరించిన వ్యక్తిని అమిత బలంగా నెట్టేసింది. తల్లీకూతుళ్లపై అతను దాడి చేస్తున్నా.. వారు వెనక్కి తగ్గలేదు. అతని వద్ద ఉన్న నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. చివరకు అతను పారిపోయాడు. ఇక మాస్కు ధరించి వచ్చిన వ్యక్తిని ఇంట్లో ఉంచి తలుపు మూశారు. స్థానికులను అప్రమత్తం చేసి తలుపు తెరవగా, అతను కత్తితో బెదిరించి గేటు బయటకు వెళ్లిపోయాడు. కానీ స్థానికులు వెంబడించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అప్రమత్తతో మరో దొంగను కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు.
గతంలో పని చేసిన వ్యక్తే చోరీకి యత్నం
చోరీకి వచ్చిన ఇద్దరిలో ఒకరు.. నవరతన్ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసినట్లు పోలీసులు తేల్చారు. అతని పేరు ప్రేమ్‌చంద్(మాస్కు ధరించిన వ్యక్తి). ప్రేమ్‌చంద్ తన స్నేహితుడు సుశీల్‌కుమార్(హెల్మెట్ ధరించిన వ్యక్తి) కలిసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకున్నారు. సుశీల్ కుమార్‌ను కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు కత్తులు, తపంచాను స్వాధీనం చేసుకున్నారు.